నెల్లూరు, జూలై 8,
ఇప్పటి వరకు చౌక దుకాణాల నుంచి ప్రభుత్వం అందిస్తున్న కంది పప్పు, పంచదార మరింత ప్రియం కానున్నాయి. దీంతో ఇక నుంచి పేద ప్రజలకు కంది పప్పు, చక్కెర అందని ద్రాక్షగా మారనున్నాయి. ప్రభుత్వం వీటి రేట్లు భారీగా పెంచాలని నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కంది పప్పుపై రూ. 27, పంచదారపై రూ. 7 అదనంగా పెంచనున్నట్లు తెలిసింది. పెంచిన రేట్లు జూలై మాసం నుంచి అమల్లోకి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పెంచిన ధరల అమలుకు సంబంధించి జిల్లాలోని పౌర సరఫరా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇప్పటి వరకు కిలో కంది పప్పును రూ. 40కు అందిస్తున్నారు. అర కిలో పంచదారను రూ. 10కు సరఫరా చేస్తున్నారు. అయితే కొత్త ధరల ప్రకారం కిలో కంది పప్పును రూ. 67 కి, పంచదార రూ.17కి పెరగనుంది. మరో వైపు కార్డు దారులపై కూడా పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడనుంది. జిల్లాలో మొత్తం 12,92,950 బియ్యం కార్డులున్నాయి. కార్డుల్లోని సభ్యులు సుమారు 35,98,438 మంది వరకు ఉన్నారు. పెంచిన ధరల ప్రకారం కంది పప్పు, చక్కెర కలిపి ప్రజలపై నెలకు సుమారు రూ. 4.40 కోట్లు అదనంగా భారం పడనుంది. అంటే కంది పప్పుపై రూ. 3.50 కోట్లు, చక్కెరపై రూ. 90. 50 లక్షలు వరకు అదనంగా భారం పడే అవకాశం ఉంది. ఇవి కాకుండా అంత్యోదయ అన్నా యోజన కార్డులు 63వేల వరకు ఉన్నాయి. వీటిపై ఆధారపడిన సభ్యులు 1.53 లక్షల వరకు ఉన్నారు. అయితే వీరికి కూడా పెంచిన ధరల ప్రకారమే కంది పప్పును సరఫరా చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే దాదాపు రూ. 17 లక్షల వరకు కార్డుల దారులపై అదనపు భారం పడనుంది.ప్రస్తుతం మార్కెట్‌లో కంది పప్పు, చక్కెర లభించే రేట్లకు, రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయనున్న రేట్లకు పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. మార్కెట్‌లో వివిధ రకాల కంది పప్పు అందుబాటులో ఉంటుంది. ఏ రకం కంది పప్పు తీసుకున్నా కాస్తా అటు ఇటుగా సగటున ప్రస్తుతం మార్కెట్లో కిలో కంది పప్పును రూ. 65 నుంచి రూ. 70 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని రకాలు అంత కంటే తక్కువ రేట్లకు కూడా దొరుకుతున్నాయి. కిలో చక్కెరను రూ. 34 నుంచి రూ. 38 వరకు అమ్ముతున్నారు. మరి కొన్ని రకాలైన పంచదారను రూ. 40 నుంచి రూ. 48 వరకు అమ్ముతున్నారు.