హైద్రాబాద్, జూలై 8,
అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జిల్లాలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. కనీసం నాణత్యా ప్రమాణాలు పాటించడం లేదు. నిబంధలకు విరుద్ధంగా బోర్లు తవ్వడం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. పట్టించుకోవల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో పట్టణాలు, మండల కేంద్రాలు, పలు గ్రామాల్లో ఇంటింటా మినరల్ వాటర్ వినియోగిస్తున్నారు. ఇదే అదునుగా జిల్లాలో వాడవాడలా వాటర్ ప్లాంట్లు వెలిశాయి. జిల్లాలో ఎనిమిది ప్లాంట్లకు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని వాటర్ ప్లాంట్లు దాదాపు 3 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా, ప్రమాణాలు పాటించకుండా ప్లాంట్లు నడుపుతున్నారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో ఊహించవచ్చు. ప్లాంట్లలో నీళ్ల క్యాన్లను అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.వాటర్ ప్లాంట్లలో వాడే ఫిల్టర్లు, రుచి కోసం వాడే కెమికల్స్‌పైనే నీటి స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. నాసిరకపు పరికరాలు, యంత్రాల వల్ల నీళ్లలో నాణ్యత కరువవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్లాంట్ల పరిసరాల్లో కనీస పరిశుభ్రత ఉండటం లేదు. నీరు నిల్వ చేసే ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. బాటిళ్లు, క్యాన్లను కడగడం లేదు. అయినా అధికారులు వాటర్‌ప్లాంట్లలో తనిఖీలు చేయడం లేదు. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తున్న కేంద్రాలను రద్దు చేసే అధికారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, విఆర్‌ఒ, మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్, మండల స్థాయిలో తహశీల్దార్‌లకు ఉంది. అయినా వారు ఏనాడూ శుద్ధజల కేంద్రాలపై దష్టి సారించిన దాఖలాలు లేవు. జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదంటే అధికారుల తనిఖీలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోంది.స్థానిక సంస్థల సరఫరా చేసే నీటిని తాగలేక ప్రజలు శుద్ధి జలాల కేంద్రాలపై ఆధారపడుతున్నారు. దిగువ, మధ్య తరగతి మొదలు సంపన్నుల వరకు వీటిపైనే ఆధారపడుతుండడంతో కేంద్రాల నిర్వాహకుల పంట పండుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల కేంద్రాలు, ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దీంతో విధిలేక ప్రజలు మినరల్ వాటర్ ప్లాంట్లపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు.పట్టణ జనాభాలో 35 శాతం మినరల్ వాటర్ తాగుతున్నారు. ఈ క్రమంలో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడుతున్నారు. మినరల్ వాటర్ ప్రక్రియలో మూడొంతుల నీరు వథాగా పోతుంది. ఈ నీటిని మరేదైనా అవసరానికి వాడుకొనే పద్ధతి పాటించడం లేదు. ఇంత నీరు వథా అవుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదనే విమర్శలు ఉన్నాయి.20 లీటర్ల క్యాన్ తయారీకి రూ.2కు మించి ఖర్చు కాదు. కానీ మార్కెట్లో రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. కూలింగ్ వాటర్ అయితే మరో రూ.5 అదనంగా తీసుకుంటున్నారు. హోం డెలివరీకి మరో రూ.5 నుంచి రూ.10 దాకా వసూలు చేస్తున్నారు. ఒక్కో కుటుంబం ప్రతి నెలా నీటిపై రూ.150 నుంచి రూ.400 దాకా ఖర్చు చేస్తోంది. ధరలను తగ్గించేలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్లలో బాటిళ్ల రూపంలో అమ్మడం ప్రారంభమైంది. ఒక్కో బాటిల్‌ను రూ.5 నుంచి రూ.10 వరకు వ్యాపారస్తులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొంత మంది నిర్వాహకులు వివిధ బ్రాండెడ్ కంపెనీల పేర్లకు దగ్గరగా ఉండే పేర్ల లేబుళ్లు అతికించి రూ.14 నుంచి రూ.20కు లీటర్ వాటర్ అమ్మడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.