విజయవాడ, జూలై 8,
మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎన్నో హామీలు ఇచ్చి అధికారం పట్టేసిన జగన్ పాలన సంతృప్తికరంగా లేదా? అన్న చర్చ జరుగుతోంది. జగన్ రెండేళ్లలో తెచ్చిన రుణాలతో రాష్ట్రం కుదేలైపోయింది. అప్పుల దెబ్బకు భవిష్యత్ అన్నది కన్పించడం లేదు. మరో వైపు ఇక అప్పులు చేద్దామన్నా దొరికే పరిస్థితి జగన్ ప్రభుత్వానికి లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పులు చేసింది. అయితే ఒక పద్ధతి ప్రకారం అప్పట్లో ప్రభుత్వం నడుచుకుందన్నది వాస్తవం. జగన్ మాత్రం తెచ్చిన అప్పలన్నీ సంక్షేమ పథకాలకు పంచేశారు. దీంతో అప్పులన్నీ అలాగే ఉండిపోయాయి. జగన్ ఇప్పటి వరకూ తెచ్చని అప్పులన్నీ అలాగే ఉండిపోయాయి. తెచ్చిన అప్పులకు వడ్డీల భారం కూడా పెరిగిపోతూ ఏపీ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిపోతోంది. దీని వల్ల భవిష్యత్తు తరాలకు ఏమీ మిగిలే సీన్ కూడా కనిపించడం లేదు. సరే కరోనా కాలంలో కూడా సంక్షేమ పధకాలు అమలు చేశామని గొప్పగా డప్పు వాయించుకుంటున్న వైసీఎపీ సర్కార్ కి ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. ఇక అప్పు ఎక్కడా పుట్టదు అని స్పష్టమైన సంకేతాలు వచ్చేశాయి.
కేంద్రప్రభుత్వంలోని బీజేపీ నేతల వద్దకు ఇటీవల ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెళ్ళి ఏపీని ఆదుకోమని కోరుతూ వచ్చారు. అయితే ఏపీలో అప్పులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించడాన్ని బీజేపీ పెద్దలు కూడా ఇష్టపడటం లేదు. ఆర్ధిక క్రమశిక్షణ అన్నది ఏపీలో లేదని కూడా వారికి అర్ధమైపోయింది. ఈ రకంగా దుబారా చేస్తూ నిధులు కావాలి అంటే ఎన్ని ఇచ్చినా ఏమి ప్రయోజనం అన్నట్లుగా కేంద్రం ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఏపీకి రుణాలు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తుందంటున్నారు.ఇక తనకున్న రుణ పరిమితిని కూడా దాటేసి ఏపీ సర్కార్ అప్పులు చేసేసింది. రానున్న రోజుల్లో కొత్త రూపాయి కూడా అప్పుగా దొరకదు అంటున్నారు. మరో వైపు రెండేళ్లలో ఏపీలో పాలనా పరమైన వైఫల్యాలు కారణంగా ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపధ్యంలో ముందు మూడేళ్ళ పాలన ఉంది. అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా జగన్ సర్కార్ కి చాలా కష్టమని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఈ గండం నుంచి ఎలా బయటపడతారో.