YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

చెట్టు నీడ

చెట్టు నీడ

పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది. ‘శివునికి అందరూ ఉన్నారు. కానీ అమ్మానాన్నా మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. అమ్మ వుంటే విషం తాగనిస్తుందా? అలా తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా? పాములు మెడలో వేసుకుని, వంటికి బూడిద పూసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తల్లి వుంటే శివునికి తిరిపమెత్తుకు తిరిగే కర్మమెందుకు పడుతుంది? అనాథలా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన?’ దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. ‘అమ్మానాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జమహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలూ స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. ‘అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది’ అని ఏడ్చింది.

అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ‘ఇక మాటలతో పనిలేదు బిడ్డా! నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం ఏమి లాభం?’ అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు, నిష్కల్మష భక్తికి ఉబ్బు శంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి ‘‘కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు. నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది.  భగవంతుడిని అదివ్వు, ఇదివ్వు అని కోరుకునేవారే కానీ, ఆయనకు అమ్మానాన్నా అయి, ఆలనాపాలనా చూసేవారెవరుంటా రు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు. నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts