న్యూఢిల్లీ జూలై 8 : కేంద్ర మంత్రులుగా అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్‌లు ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ విజన్‌లో రైల్వే ప్రాధాన్యమైందన్నారు. రైల్వేల నుంచి ప్రతి ఒక్కరూ బెనిఫిట్ పొందాలన్నదే మోదీ ఉద్దేశమన్నారు. ఆయన విజన్ కోసం తాను పనిచేయనున్నట్లు మంత్రి అశ్విని తెలిపారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా..
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు గత ఏడేళ్ల నుంచి ప్రధాని మోదీ అద్భుత రీతిలో పనిచేస్తున్నారన్నారు. గతంలో ఐబీ మంత్రిత్వశాఖలో పనిచేసినవారికి, ప్రధాని మోదీ తనకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని అనురాగ్ తెలిపారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్‌సుక్ మాండవీయ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ కూడా ఆయన ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బుధవారం మాండవీయ ప్రమాణ స్వీకారం చేశారు. మాండవీయది గుజరాత్. ఆయన వయసు 49 ఏళ్లు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కూడా. క్యాబినెట్ విస్తరణలో ఆరోగ్యశాఖను దక్కించుకున్న మాండవీయ.. కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖను కూడా నిలుపుకున్నారు.