న్యూఢిల్లీ జూలై 8
కేంద్ర ఐటీశాఖ మంత్రిగా ఇవాళే బాధ్యతలు చేపట్టిన అశ్విని వైష్ణవ్.. వచ్చీ రాగానే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేలపై రూపుదిద్దుకున్న చట్టాలే అత్యున్నతమని, కచ్చితంగా కొత్త ఐటీ రూల్స్‌ను ట్విట్టర్ పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇటీవల ట్విట్టర్ సంస్థకు, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పలు మార్లు ట్విట్టర్‌కు ఇలాంటి వార్నింగ్‌లే ఇచ్చారు. కానీ ట్విట్టర్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఇవాళ ఢిల్లీ హైకోర్టులోనూ ట్విట్టర్ కేసు విచారణకు వచ్చింది. 8 వారాల్లోగా గ్రీవియన్స్ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు ఆ సంస్థ కోర్టుకు చెప్పింది. రూల్స్ పాటించడం లేదని కోర్టు హెచ్చరించిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రీవియన్స్ ఆఫీసర్‌ను పెట్టాలని కేంద్రం కోరినా.. ట్విట్టర్ మాత్రం స్పందించడంలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. కావాల్సినం సమయం ఇవ్వలేమని హైకోర్టు జస్టిస్ రేఖా పాలి తన తీర్పులో అన్నారు.