అకాల వర్షం సామాన్య ప్రజానీకానికి వేసవి తాపంనుంచి ఉపశమనాన్నిచ్చినా, రైతాంగానికి మాత్రం తీరని నష్టం కలిగించింది. ఏడాదంతా కష్టపడి పండించిన పంట కేవలం మూడు గంటల వర్షంతో కళ్లముందే నీటిపాలవ్వడంతో రైతులు ఆవేదనకు అంతులేకుండా పోయింది. విజయనగరం జిల్లాలో అరటి, మామిడి, జీడిమామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు పిడుగుపాటుకు గురై ముగ్గురుమృతి చెందారు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం పడిన వర్షానికి ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం కూడా వాటిల్లింది. జిల్లాలో పార్వతీపురం మండలం వి ఆర్ పేట గ్రామానికి చెందిన సింహాచలం, బలిజి పేట మండలం వెంగాపురం గ్రామానికి చెందిన పిల్లి ఎల్లమ్మ, పూసపాటిరేగ మండలం తిప్పలవసల గ్రామానికి చెందిన మత్స్యకారుడు భూలోక చనిపోయారు. చింతపల్లి సముద్ర తీరంలో వేటకు వెళ్లిన దానయ్య, అమ్మోరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు జిల్లాలో గజపతినగరం , మెంటాడ, సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో వర్ష ప్రభావంతో ఉద్యానవన పంటలు పోయాయి. పూసపాటిరేగ మండలంలో 10 హెక్టార్లు, భోగాపురం మండలంలో 3 హెక్టార్లలో ఉద్యాన పంటలు పోయాయి. వీటిలో అరటి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. పంటలు చేతికందివచ్చిన తరుణంలో అకాల వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.