న్యూఢిల్లీ, జూలై 8,
వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజుకి వైసీపీ భారీ షాకిచ్చింది. జగన్ సర్కార్‌పై వరుస విమర్శలతో కొరకరాని కొయ్యగా తయారైన రఘురామపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే మరోమారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి , లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ లోక్‌సభ స్పీకర్‌ని కలిశారు. ఎంపీ రఘురామ వైసీపీ గుర్తుపై గెలిచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు కోరారు. రఘురామ పార్టీ వ్యతిరేక చర్యలకు సంబంధించిన ఆధారాలను కూడా స్పీకర్‌కి అందజేసినట్లు తెలుస్తోంది. ఆయనపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయకూడదని.. త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు విన్నవించారు. ఎట్టిపరిస్థితుల్లో రఘురామను ఎంపీగా కొనసాగనీయకూడదని వైసీపీ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పదవులు కూడా ఉండవని తీవ్ర హెచ్చరికలు పంపేందుకు వైసీపీ సిద్ధమైంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లోనూ రఘురామ వ్యవహారం చర్చించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. మరోమారు వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ని కలవడంతో రఘురామపై అనర్హత వేటు పడుబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.