రాజమండ్రి, జూలై 9,
మార్పు` మంచిదే!.. ఏపీ బీజేపీలో కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట ఇది..! పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. భిన్నమైన ఆలోచనలు ఉన్న ప్రజల మధ్య నెట్టుకు వచ్చేందుకు.. మరో ఊతం అవసరమని నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికి రెండు కీలక ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు చేసింది. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆశించిన విధంగా ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ కలవకుండా పోటీ చేసింది. అయితే.. ఫలితం మాత్రం ఎలాంటిది దక్కించుకుందో అందరికీ తెలిసిందే.ఇక, తిరుపతి ఉప ఎన్నికలోనూ పార్టీ పట్టు కోల్పోయింది. గెలిచి తీరుతామని అనుకున్నా.. ఈ ఎన్నికల్లో జనసేన మద్దతు ఇచ్చినా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోగా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. పైగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను ఏరీకోరి ఇక్కడ పోటీలో పెట్టినా ఆమె ఛరీష్మా కూడా ఏ మాత్రం పని చేయలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుని.. కాపులు బలంగా ఉన్న ప్రాంతంలో పోటీ చేసిన బీజేపీకి.. ఇక్కడ వచ్చిన ఓట్లు చూసుకున్నాక ఏపీలో తమ బలం ఏంటన్న దానిపై ఓ క్లారిటీ అయితే వచ్చేసిందట.దీంతో ఇప్పుడు నేతలు ఎక్కువ మంది మార్పు మంత్రం పఠిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ క్రమంలో బలమైన పార్టీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై కొన్ని రోజులుగా ఢిల్లీలో కీలక నేతలు మంత్రాంగం జరిపారు. మార్పు దిశగా అడుగులు వేసేందుకు కేంద్రంలోని పార్టీ పెద్దలు సైతం ఓకే చెప్పారు. ఇక టీడీపీతో కలవాలని నిత్యం అక్కడ జాతీయ నేతల చెవుల్లో ఊదరగొట్టే బ్యాచ్ ఎప్పుడూ ఏపీ బీజేపీలో ఒకటి రెడీగానే ఉంటుంది. దీంతో మళ్లీ టీడీపీతో పొత్తుకు బీజేపీ రెడీ అవుతున్న సంకేతాలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా టీడీపీని విమర్శిస్తున్న నేతల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.అదే సమయంలో టీడీపీ నేతలకు మద్దతుగా కూడా నిలుస్తున్నారు. వారిపై ప్రభుత్వం చేసే విమర్శలకు బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇవ్వడంలో కలిసి వస్తున్నారు. ఇక, ప్రభుత్వంపైనా ఎదురు దాడిని తీవ్రం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే.. అటు జనసేన , ఇటు బీజేపీ కూడా మళ్లీ టీడీపీ వైపు అడుగులు వేస్తున్నాయనే అంటున్నారు పరిశీలకులు. కొన్ని మార్పులు తథ్యమని పార్టీలో కొందరు సీనియర్లు ఇప్పటికే మీడియాకు లీకులు ఇచ్చారు. ఇక, ప్రధాన మీడియా కూడా ఈ రెండు పార్టీలను ఏకం చేసే దిశగా కథనాలు రాస్తుండడం దీనికి మరింత ప్రాధాన్యం సంతరించుకోవడం విశేషం.