హైదరాబాద్, జూలై 9,
చిత్రసీమకు ఓటీటీ వరం లాంటి శాపం. థియేటర్లు లేనప్పుడు ప్రేక్షకులకు ప్రత్యామ్నాయంగా మారింది ఓటీటీ. నిర్మాతలకు కల్పవృక్షంగా కనిపించింది ఓటీటీ. ఇప్పుడు అదే ఓటీటీ… థియేటర్ల పాలిట భస్మాసుర హస్తం అయ్యింది. ఓటీటీల వల్ల ఇప్పటికే కృంగిపోయిన థియేటర్ సంస్క్రృతి మరింత మసకబారిపోతుందని, థియేటర్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడం ఖాయమని ఓ వర్గం ఆవేదన చెందుతోంది. ఓటీటీలకు సినిమాని అమ్మొద్దంటూ…ప్రదర్శన కారులు నిర్మాతలకు చేతులెత్తి దండాలు పెడుతున్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశం ఎజెండా ఒక్కటే. థియేటర్లని కాపాడడం. ఓటీటీలకు సినిమాల్ని అమ్ముకోవద్దని, అలాగైతే థియేటర్ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవేదన వ్యక్తం చేసింది. అక్టోబరు నెలాఖరు వరకూ నిర్మాతలంతా తమ సినిమాల్ని ఓటీటీలకు అమ్ముకోకుండా ఆగాలని, ఆ తరవాత థియేటర్ వ్యవస్థ పుంజుకుంటుందని, సినిమాలన్నీ థియేటర్లలోనే విడుదల చేసుకోవొచ్చని సూచించింది. అయితే… సినిమాల్ని ఓటీటీలకు వెళ్లకుండా ఆపే హక్కు ఎవ్వరికీ లేదు. సినిమా అనేది డబ్బుతో ముడి పడి ఉన్న వ్యవహారం. సినిమా పూర్తయి.. ఇంకా విడుదల కాలేదంటే.. నిర్మాత గుండెలు గుభేలు మంటుంటుంది. రోజు రోజుకీ వడ్డీ పెరిగిపోతుంటుంది. సినిమాస్టేల్ అయిపోతుందన్న బెంగ మరోటి. తీరా విడుదలైన తరవాత జనాలు చూస్తారా, లేదా? అనే టెన్షన్ తో నిద్ర కూడా పట్టదు. అలాంటప్పుడు ఓటీటీలకు అమ్ముకుని సేఫ్ అయిపోదామని చూడడం నిర్మాతల తప్పు కాదు. కరోనా సెకండ్ వేవ్ లోనూ థియేటర్లు మూతబడ్డాయి. కొన్ని సినిమాలు ఓటీటీలకు వెళ్లిపోయాయి. అయితే.. చాలా సినిమాలకు ఓటీటీ ఆఫర్లు వచ్చినా, నిర్మాతలు నిలబడగలిగారు. ఓటీటీలకు అమ్ముకోకూడదని మొండిగా ఉన్నారు. ఇలా ఎంత కాలం? మార్చిలో ఓ సినిమా పూర్తయిందనుకుందాం. ఆ నిర్మాత నవంబరు వరకూ తన సినిమాని విడుదల చేసుకోకుండా ఉండగలడా? చిన్న నిర్మాతలకు అంత ఓపిక, ధైర్యం ఉంటుందా? పెద్ద సినిమాలే ఓటీటీ బాట పడుతున్నప్పుడు చిన్న నిర్మాతల మాటేంటి? అయితే హీరోలంతా… ఓటీటీలకు నో చెప్పడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఓటీటీలో విడుదలైతే హీరోలకు అంత కిక్ ఉండదు. వసూళ్లు,రికార్డుల ఊసులు వినాలంటే.. థియేటర్లో విడుదల చేసుకోవాల్సిందే. అందుకోసమే హీరోలు ఓటీటీలకు నో చెబుతుంటారు. నిర్మాతల ఆలోచనలు వేరు కదా. తాము గట్టెక్కితే చాలు అనుకుంటారు. ఓటీటీలకు సినిమాల్ని అమ్ముకోవాలా, వద్దా? అనేది పూర్తిగా నిర్మాతల చేతిలో ఉన్న విషయం. వాళ్లనెవరూ కంట్రోల్ చేయలేరు. కాకపోతే… థియేటర్లు తెరచుకున్నాక.. అన్ని సినిమాలకూ కావల్సిన సంఖ్యలో థియేటర్లు ఇస్తాం.. అన్నమాట ఇవ్వాలి. పెద్ద సినిమా వస్తుంటే, చిన్న సినిమాల్ని సైడ్ చేసేసే సంస్క్కృతి పక్కన పెట్టగలగాలి. అప్పుడే మళ్లీ నిర్మాతలకు థియేటర్ వ్యవస్థపై భరోసా కలుగుతుంది.