న్యూఢిల్లీ జూలై 9
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. వారిలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన మరుపోలు జశ్వంత్ రెడ్డి కూడా ఉన్నారు. 23 ఏండ్ల జశ్వంత్ రెడ్డి ఐదేండ్ల క్రితం భారత సైన్యంలో చేరారు. జశ్వంత్ రెడ్డి మరణంతో దరివాద కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.కాగా, దక్షిణ కశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, సైనికులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. కుల్గాం జిల్లా రెడ్‌వానీ గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. దీంతో గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఆపరేషన్ ఇంకా కొనసాతున్నది. దీంతో 48 గంటల వ్యవధిలో కశ్మీరులో ఇది నాలుగు ఎన్‌కౌంటర్ కావడం విశేషం.