YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టోల్ ఫ్రీ నంబర్ తో అవకతవకలకు అడ్డుకట్ట

టోల్ ఫ్రీ నంబర్ తో అవకతవకలకు అడ్డుకట్ట

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అంగన్ వాడీలను బలోపేతం చేసి గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది. అయితే సిబ్బందిలో కొందరి అలసత్వం, ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా కొన్నిప్రాంతాల్లో ఈ లక్ష్యం నీరుగారుతోంది. ఈ విషయాలు గుర్తించిన ప్రభుత్వం అంగన్ వాడీల పనితీరును మెరుగుపరచేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏవైనా లొసుగులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలిసేలా మహిళా శిశు సంక్షేమ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. లబ్ధిదారులు 155 209 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను డయల్ చేసి అవకతవకలపై  ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ రోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. జీవీకే, ఈఎంఆర్‌ఐ, మహిళా శిశుసంక్షేమ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం, పూర్వ ప్రాథమిక విద్య, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య  పరీక్షలు, రిఫరల్‌ సేవలు, పోషణ- ఆరోగ్య విషయాలు అనే ఆరు రకాల సేవలను అందిస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల శిశువులకు నెలకు 2.5 కిలోల చొప్పున బాలమృతం ప్యాకెట్లు, 16 కోడిగుడ్లు ఇస్తారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు ఉడికించిన కోడిగుడ్లు, ఒక పూట భోజనం అందిస్తారు. గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనం, 200 మిల్లీ లీటర్ల పాలు, గుడ్లు అందజేస్తారు. ఈ క్రమంలో అవకతవకలు నివారించేందుకు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. అంగన్ వాడీలను పటిష్ఠపరిచి, మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మహిళా శిశు సంక్షేమ శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts