3 లక్షల టన్నులకు పైగా బియ్యం సరఫరా చేయాలంటూ తెలంగాణకు తమిళనాడు నుంచి ఆర్డర్ వచ్చింది. అంతే ఒక్కసారిగా స్థానికంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. జగిత్యాలలో అయితే కొనుగోళ్లు జోరందుకున్నాయి. సర్కార్ కొనుగోళ్లకు మించి ధాన్యం సేకరించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. ఈ రబీ సీజన్ లో రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో వరి పండించిన మూడో జిల్లా జగిత్యాల. పరిస్థితులు ఆశాజనకంగానే ఉండడంతో దిగుబడి అధికంగా వచ్చింది. వరి నాణ్యత కూడా బాగుంది. దీంతో వ్యాపారులు స్థానికంగా ధాన్యం సేకరణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వ కనీన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,590 ఉంది. అయితే తాజా ఆర్డర్ ప్రకారంగా మిల్‌పాయింటు వద్ద నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలున్న ధాన్యానికి రూ.30 చొప్పున అధికంగా చెల్లించి రూ.1,620 చొప్పున ధరకు రైతుల వద్దనుంచి కొనుగోలు చేయాలి. రూ.1,620 ధర చొప్పున కొనుగోలు చేసినట్లు పత్రాలను సమర్పిస్తేనే సదరు మిల్లు నుంచి ఎగుమతి అవకాశాలను కల్పిస్తారు.
జగిత్యాల తదితర మార్కెట్ యార్డుల్లోనూ దొడ్డువడ్లకు అధికధర లభిస్తోంది. దీంతో రైతులు పెద్దఎత్తున ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. జగిత్యాల బీటులో ఇప్పటికే 11,500 క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. తేమ, తరుగు, తప్పతాలు తదితర ఇబ్బందుల్లేకుండా కనీస ధరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. దీంతో యార్డుకు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకువస్తున్నారు రైతులు. జగిత్యాలలోని పాతబీటులో ధాన్యంకు స్థలం సరిపోక మే 3వరకు సెలవులు ప్రకటించారు. ఇది ధాన్యం రాక ఎంత అధికంగా ఉందన్న విషయాన్ని వెల్లడిస్తోంది. ప్రభుత్వ కేంద్రాల్లో తూకం వేసిన బస్తాల తరలింపులో జాప్యం ఉంటోంది. గోనె సంచుల కొరతా ఉంది. ఇకఆన్‌లైన్ ద్వారా ఆలస్యపు చెల్లింపులకు ప్రస్తుత ప్రైవేటు సేకరణ ద్వారా ఈ సీజనుకు లభించిన ఉపశమనంగా భావిస్తున్నారు అన్నదాతలు. దీనిపై జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి వివరణ ఇచ్చారు. తమిళనాడు ద్వారా వచ్చిన ఆర్డర్ మేరకు ఉమ్మడి జిల్లాలోని మిల్లులకు సేకరణ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఏదైతేనేం.. ఈ ఏడాది అన్నదాతకు మంచి మద్దతు ధర లభించడంపై అంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు.