YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భానుడి భగభగలు..బేజారవుతున్న జనాలు..

భానుడి భగభగలు..బేజారవుతున్న జనాలు..

సూరీడు.. రోజురోజుకు తీవ్రత అధికం చేస్తున్నాడు. గంటగంటకూ డోస్ పెంచేస్తున్నాడు. దీంతో ఉదయం 8 గంటల నుంచే టెంపరేచర్ తీవ్రమవుతుండడంతో జనాలు బేజారైపోతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక 10 గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే అగ్నిగోళాన్నే తలపిస్తోంది వేడిమి. ఇది చాలదన్నట్లు ఉదయం 9 గంటల నుంచే అటు భానుడి వేడితో పాటూ వేడిగాలులు విజృంభించేస్తున్నాయి. ఫలితంగా జనం బయటకు రావడానికి భయపడిపోతున్నారు. గొడుగులు, స్కార్ఫ్ లు లేకుండా ఆరు బయట అడుగెట్టడంలేదు. తారు రోడ్డు నుంచి వస్తున్న సెగలకు నడుస్తున్నా, ద్విచక్రవాహనంపై వెళ్లినా కాళ్లు సుర్రుమన్నాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్డు వెంట ఉన్న చిరు వ్యాపారుల కష్టాలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. గొడుగులు వేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఆదివారం ఉష్ణోగ్రత కొంత తగ్గినా సోమ, మంగళవారాల్లో విజృంభించేసింది. టెంపరేచర్ 44 డిగ్రీలు దాటిపోవడంతో అంతా బెంబేలెత్తిపోయారు. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఉష్ణోగ్రతల ధాటికి జనాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇళ్లల్లో ఉంటే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వద్దే గడుపుతున్నారు. ఇక బయటకొచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఉష్ణతాపాన్ని తప్పించుకునేందుకు వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. నీడ ఎక్కడ ఉంటే అక్కడ కొంత సేపు సేద తీరుతూ.. ప్రయాణం సాగిస్తున్నారు. వేడిమిని తట్టుకునేందుకు చల్లటి పానీయాలు, కొబ్బరినీళ్లు సేవిస్తున్నారు. భానుడి విజృంభణ ఫలితంగా కొబ్బరి బొండాలు, శీతలపానీయాల విక్రయదారులకు బిజినెస్ బాగానే సాగుతోంది. అయితే వారూ ఉష్ణతాపానికి అల్లాడిపోతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా వేడిమి పెరిగిపోవడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అధికంగా సేవించాలని సూచిస్తున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని చెప్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో పనులు చక్కబెట్టుకునేందుకు ప్రధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్తున్నారు.

Related Posts