విజయవాడ, జూలై 10,
కృష్ణా జిల్లాలో సుబాబుల్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సుబాబుల్ కర్ర కొనుగోలులో మార్కెట్ యార్డుల పర్యవేక్షణ కొరవడడంతో పేపర్ కంపెనీలు, ట్రేడర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఏదో ఒక పేరుతో ఏటా ధర తగ్గించి రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ధర గిట్టుబాటు కాని పరిస్థితుల్లో వేలాది ఎకరాల్లో సుబాబుల్‌ను రైతులు తొలగిస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కూడా సుబాబుల్ రైతులపై తీవ్రంగా పడుతోంది. సుబాబుల్ కర్ర కట్టింగుకు అవసరమైన యంత్రాల కిరాయిలు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరగడం రైతులకు భారంగా మారింది.ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం టన్ను కర్రకు మద్దతు ధరను రూ.4,200గా ప్రకటించింది. మార్కెట్ యార్డుల పర్యవేక్షణలో రైతులకు పేపర్ కంపెనీలు చెల్లింపులు జరిపేవి. కర్ర నరకడానికి, యార్డుకు తరలించేందుకు టన్నుకు రూ.700 ఖర్చులుపోను రూ.3,500 వరకూ రైతులకు అందేది. మంచి ఆదాయ వనరుగా ఉండటంతో కృష్ణా జిల్లా పశ్చిమ ప్రాంతంలో 60 వేల ఎకరాల్లో సుబాబుల్ సాగు విస్తరించింది. ప్రభుత్వాల విధానాలు మారడంతో మార్కెట్ యార్డుల పర్యవేక్షణ కొరవడింది. ట్రేడర్లకు లైసెన్స్‌లు ఇచ్చి వారి ద్వారానే పేపర్ కంపెనీలు కర్ర కొనుగోలు చేస్తున్నాయి. ట్రేడర్లు రంగప్రవేశం చేసిన వెంటనే యార్డులో లారీ లోడింగ్, కంపెనీకి రవాణా కిరాయిల భారాన్ని రైతులపై మోపి మద్దతు ధర నుండి ఈ మొత్తాన్ని మినహాయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గతేడాది టన్నుకు రూ.1800 ధర మాత్రమే రైతులకు అందింది. తాజాగా పేపర్ కంపెనీలు సుబాబుల్ మద్దతు ధరను టన్నుకు రూ.300 తగ్గించాయి. లారీ కిరాయిలు పెరిగాయని ఇతరత్రా కారణాలు చూపి టన్ను కర్రను రూ.1,300కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో, రైతులు కనీస ఆదాయం రాక క్రమంగా సుబాబుల్ తోటలను తొలగిస్తున్నారు. ఈ ఏడాది పది వేల ఎకరాల్లో తోటలు తీసివేశారు. గత మూడేళ్లలో జిల్లాలో 23 వేల ఎకరాల విస్తీర్ణంలో తోటలను తొలగించారు. సాగు విస్తీర్ణం 60 వేల ఎకరాల నుంచి 37 వేల ఎకరాలకు తగ్గిపోయింది.ఎకరంన్నరలో సుబాబుల్ సాగు చేశా. మొదటి కటింగ్‌లో మార్కెట్ యార్డుల ద్వారా విక్రయిస్తే 30 టన్నులకు రూ.1.10 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు యార్డుల ద్వారా కొనుగోలు లేకపోవడంతో నాలుగేళ్ల తర్వాత దిగుబడి, నాణ్యతలో తేడా లేకపోయినా రెండో కటింగ్‌లో దళారులకు అమ్మితే రూ.30 వేలు మాత్రమే వచ్చింది. ఈ మొత్తం ఎరువులకు, ఒకటికి పదిసార్లు తిరిగి పంటకు నీరు పెట్టడానికి కూడా సరిపోని విధంగా ఉంది. మొదటి కటింగ్‌తో పోలిస్తే రెండో కటింగ్‌లో రూ.80 వేల ఆదాయం కోల్పోయా. గిట్టుబాటు కాకపోవడంతో మొద్దులు తొలగించానని రైతు చెబుతున్నారు