YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆయిల్‌పాం రైతుకు అండ

ఆయిల్‌పాం రైతుకు అండ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్‌పాం పంటను పెద్ద మొత్తంలోనే పండిస్తున్నారు రైతులు. దీంతో ఈ పంట పండించే కర్షకులకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరావు సైతం ఇదే హామీ ఇచ్చారు. టన్ను ఆయిల్‌పాంకు రూ.10వేలు ధర దక్కే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు. ఆయన వాగ్ధానం కార్యరూపం దాల్చింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆయిల్‌పాం రైతులకు మంచి గిట్టుబాటు ధర దక్కింది. మే 1న ఆయిల్‌పాం గెలల ధర టన్నుకు రూ.10,048 లభించింది. దీంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తమకు అండగా నిలబడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంల్లో కొంతకాలంగా ఆయిల్‌పాం సాగు విస్తరించింది. ఉభయ జిల్లాల్లో 13 వేల హెక్టార్లలో ఆయిల్‌పాంను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 70 శాతం పంట రైతుల చేతికి రావడంతో గెలలను కోసి  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమలకు తరలిస్తున్నారు రైతులు. 

టన్ను ఆయిల్‌పాం ధర రూ.10,048 పలకడంలో ఈ పంట పండించే రైతుల్లో చాలా ఉత్సాహం నెలకొంది. మిగిలిన పంటకూ ఇదే విధంగా ధర లభించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్క గలమని ఆశిస్తున్నారు. ఇదిలాఉంటే అశ్వారావుపేటలోని పరిశ్రమ సామర్ధ్యం గంటకు 5 టన్నులు. అయితే పంట విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని సామర్ధ్యాన్ని 30 టన్నులకు పెంచారు అధికారులు. అప్పారావుపేటలోని పరిశ్రమ సామర్ధ్యం గంటకు 30 టన్నులు. అప్పారావుపేట పరిశ్రమను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ పరిశ్రమలో ఆయిల్‌పాం గెలల రికవరీ శాతం ఎక్కువగా ఉండటం, నూనె వృథా లేకపోవడంతో ధర రూ.10 వేలు దాటిందని సమాచారం. అప్పారావుపేటలో రెండో పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటే రైతులకు సమస్యలు ఉండవని, కష్టాలు తీరుతాయని చెప్తున్నారు. దేశంలో అత్యధిక నూనె శాతం వచ్చేది కేవలం అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమలో ఉంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడంతో ఇది సాధ్యమవుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఆయిల్‌పాంను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

Related Posts