YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రేవంత్ ఎఫెక్ట్... కిషన్ రెడ్డి ప్రమోషన్

 రేవంత్ ఎఫెక్ట్... కిషన్ రెడ్డి ప్రమోషన్

 రేవంత్ ఎఫెక్ట్...
కిషన్ రెడ్డి ప్రమోషన్
హైదరాబాద్, జూలై 10
తెలంగాణ బీజేపీ లో అప్పుడే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఎఫెక్ట్ కనిపిస్తుందా? రేవంత్‌ని పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన వెంటనే కమలం పార్టీ అలెర్ట్ అయిందా? అందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కి ప్రమోషన్ వచిందా? కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ప్రమోషన్ ఇచ్చిన మోడీ, కిషన్‌రెడ్డికి అనూహ్యంగా పదోన్నతి కల్పించడం వెనుక ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పినట్టయిందా? కేబినెట్‌ బెర్త్‌లో కిషన్‌‌రెడ్డి చోటివ్వడం వెనుక ఏం జరిగింది.? ఈక్వేషన్స్‌... కాలిక్యులేషన్స్‌. ఎవరు ఎలా ఉన్నా ఎవరు ఎంతగా వాదిస్తున్నా ఈసారి మాత్రం మోడీ మాత్రం తెలుగు రాష్ట్రాలపై భారీ స్కెచ్‌ వేశారన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక టాక్. మరీ ముఖ్యంగా తెలంగాణలో పట్టు సాధిస్తున్న కాషాయదళానికి మరింత ఊతమిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసిపోతోంది. ఎందుకంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ ఫలాలంటూ ప్రజల్లోకి దూసుకుపోతోంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు. కేసీఆర్‌ సర్కార్‌ మీద ఒంటి కాలి మీద లేస్తున్నారు. పాదయాత్రలంటూ ప్లాన్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమలం పార్టీని ట్రాక్‌లో పెట్టేందుకు పట్టాలపై పరుగులు పెట్టించేందుకే కిషన్‌రెడ్డికి కేబినెట్‌ బెర్త్‌ దక్కిందన్న చర్చ జరుగుతోంది.ఎందుకంటే తెలంగాణలో రాజకీయాలు ఏ రోజుకారోజే అతి వేగంగా మారుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పట్టుకోసం పోటీలు పడి పావులు కడుపుతున్నాయి. నిన్నామొన్నటి వరకు సైలెంట్‌గా కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ప్రకటించడంతో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అలెర్ట్ అయిందన్న ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ ఒక్క నిర్ణయం తీసుకుంటే దానికి కౌంటర్‌గా బీజేపీ మరో నిర్ణయం తీసుకుంటుండంతో రెండు పార్టీలు పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న రోజే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేబినెట్‌ బెర్త్‌ కేటాయిస్తూ మంత్రివర్గంలో ప్రమోషన్ రావడంతో రేవంత్ ఎఫెక్ట్ బీజేపీలో కనిపించిందన్న చర్చ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ పట్టున్న సామాజికవర్గం రెడ్డి సామాజికవర్గం కావడంతో ఆ వర్గాన్ని అక్కున చేర్చుకోవడానికి రెండు జాతీయపార్టీలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఆనవాయితీ ప్రకారం రేవంత్‌రెడ్డికి కొత్త పీసీసీ పదవి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్‌ను అధికారికంగా ప్రకటించిన వెంటనే రెడ్డి సామాజికవర్గం ఆయన వైపు తిరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరగడంతో బీజేపీ ఆ వర్గానికి పెద్ద పీట వేసిందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అందుకే అప్రమత్తమైన పార్టీ అధినాయకత్వం అదే సామాజికవర్గనికి చెందిన కిషన్‌రెడ్డికి ప్రమోషన్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే రెడ్డి సామాజికవర్గం ఆ పార్టీ వైపు ర్యాలీ కావాల్సిందే అనే ప్రచారం ఉంది. అందుకే బీజేపీ అధిష్టానం త్వరలో ఎన్నికలు లేకున్నా ఆగమేఘాల మీద కిషన్‌రెడ్డికి క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. తాము కూడా రెడ్డి సామాజికవర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టు ఎస్టాబ్లిష్‌ చేసేలా ప్లాన్‌ వేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా రాజకీయంగా తెలంగాణలో పార్టీ బలపడానికే కిషన్‌రెడ్డి కి ప్రమోషన్ ఇచ్చిందని చెప్పుకునే వాళ్లు చెప్పుకుంటున్నారు. కొందరు బీజేపీ నేతలైతే ఆఫ్‌ ద రికార్డ్‌గా ఈ ప్రచారం నిజమేనని ఒప్పుకుంటున్నారు కూడా.  తెలంగాణలో త్వరలో ఎన్నికలు లేకున్నా కిషన్‌రెడ్డికి ప్రమోషన్ రావడం ఆయన పనితీరుకి నిదర్శనమంటున్నారు కమలనాథులు. 2019లో లోక్‌సభకు ఎన్నికైన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి స్వల్పకాలంలోనే కీలక అంశాల్లో సమర్థంగా వ్యవహరించారు. బీజేపీకి రాజకీయంగా సవాలుగా మారిన అంశాలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర విభజన బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు సమయాల్లో పార్లమెంటులో సమర్థంగా వ్యహరించారన్న పేరుంది. బీజేపీకి రాజకీయంగా కీలకమైన ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు సంస్థల వల్ల తలెత్తే సమస్యను పరిష్కరించడానికి కిషన్‌రెడ్డి చేసిన కృషికి ఫలితమే ఈ ప్రమోషన్‌ అన్న టాక్‌ కూడా ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మోడీ- కిషన్‌రెడ్డికి మరింత పెద్ద బాధ్యతను అప్పగించారట. ఏమైనా తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి కేబినెట్‌ హోదా పొందిన నేతగా రికార్డులకెక్కారని కమలనాథులు భుజాలు చరుచుకుంటున్నారు. మరి రెడ్డి ఈక్వేషన్‌లో తెలంగాణలో కమలం పార్టీ పరుగులు పెడుతుందో లేదో చూడాలి.

Related Posts