ఢిల్లీలో లౌడ్ స్పీకర్లు వాడితే లక్ష జరిమానా
న్యూఢిల్లీ, జూలై 10,
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు పొల్యుషన్ కంట్రోల్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకలు, సమావేశాలు, పండుగలు, ఉత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి పాల్పడితే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శబ్దకాలుష్యానికి విధించే జరిమానా మొత్తాల్ని సవరిస్తూ కాలుష్య నియంత్రణ కమిటీ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది.తాజా నిబంధనల ప్రకారం.. పండగ సమయాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్లో నిర్దేశిత సమయం తర్వాత కూడా టపాసులు పేల్చితే రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సైలెంట్ జోన్‌లలో ఈ జరిమానా రూ.3000గా పేర్కొంది. ఇక నివాస సముదాయాల్లో పెళ్లి వేడుకలు, పబ్లిక్ ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాల్లో బాణసంచా నిబంధనలు మొదటిసారి ఉల్లంఘిస్తే రూ.10,000, సైలెంట్ జోన్‌లలో ఈ జరిమానా రూ.20వేలుగా నిర్ణయించింది. రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.40వేలు, అంతకంటే ఎక్కువసార్లు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని పేర్కొంది.అంతేకాదు, ఆ ప్రాంతాన్ని సీల్ చేస్తామని కూడా హెచ్చరించింది. ఇక డీజిల్ జనరేటర్ల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా కాలుష్య నియంత్రణ కమిటీ కఠిన చర్యలు చేపట్టింది. ఎటువంటి అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. అలాగే 62.5 నుంచి 1000 కేవీ జనరేటర్ సెట్లను ఉపయోగిస్తే రూ.25వేలు, 1000KVA కంటే ఎక్కువ సామర్థ్యం గల జనరేటర్లను వినియోగిస్తే రూ.లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది.భారీ శబ్దాలు వచ్చే నిర్మాణ పరికరాలు ఉపయోగిస్తే రూ.50వేల జరిమానా ఉంటుందని తెలిపింది. కాలుష్య నియంత్రణ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆమోదం తెలిపింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తదుపరి చర్యలు తీసుకోవాలని గతేడాది ఆగస్గు 13న ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ పొల్యుషన్ కంట్రోల్ కమిటీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఎన్‌జీటీ ఆదేశించింది. ప్రజారోగ్యం, వాతావరణ పరిరక్షణకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించింది.