YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*వర ప్రదాయిని వైష్ణోదేవి*

*వర ప్రదాయిని వైష్ణోదేవి*

ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భాసిల్లుతోంది త్రికూటాచల వాసిని వైష్ణోదేవి. సముద్రమట్టానికి సుమారు అయిదువేల అడుగుల ఎత్తులో, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన ఈ చల్లనితల్లిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకోవడం విశేషం.భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు నిలయంగా చెప్పవచ్చు. వాటిలో చారిత్రాత్మకమైనవి కొన్నయితే వింతలూ విశేషాలూ కలిగినవి మరికొన్ని. అలాంటి వాటిలో వైష్ణోదేవి ఆలయం ఒకటి. మంచుకొండల నడుమ  జమ్మూకశ్మీర్‌కి సమీపాన ఉన్న ఈ ఆలయాన్ని లక్షల సంవత్సరాల కిందట నిర్మించారని చెబుతారు. ఉత్తరాదివారికి కొంగు బంగారమై విలసిల్లే వైష్ణోదేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనిపించదు. అందుకే  ఇక్కడివారిలో ఈ దేవిని లక్ష్మీస్వరూపమని కొందరూ సరస్వతీ స్వరూపమని మరికొందరూ భావిస్తారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ... ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే వైష్ణోదేవి. 

స్థలపురాణం

జమ్మూలోని త్రికూట పర్వత సానువుల్లో కొలువైన వైష్ణోదేవి ఆరాధన ఎప్పుడు ఎలా మొదలైంది అన్న విషయాలమీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే త్రికూట పర్వతాలూ అందులోని ఈ మూడు దేవతామూర్తులూ లక్షల సంవత్సరాల నుంచీ ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా. నిజానికి పాండవుల కాలంలోనే శక్తి ఆరాధన మొదలైందనీ, ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ఉందనీ చరిత్రకారులు చెబుతున్నారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడి ఆదేశానుసారం అర్జునుడు వైష్ణోదేవిని ఆరాధించి, దేవి ఆశీసులు పొందాడని వ్యాసమహాభారతం స్పష్టం చేస్తోంది. పాండవులే అమ్మవారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.  అమ్మవారి ఆలయానికి కొద్ది దూరంలోనే అయిదు రాతి కట్టడాలు ఉన్నాయి. భక్తులు ఈ కట్టడాలను పాండవులకు ప్రతీకలుగా భావిస్తారు. సతీదేవి కుడిభుజం ఈ క్షేత్రంలో పడటం వల్ల ఇది కూడా శక్తిపీఠాల్లో ముఖ్యమైందిగా  విరాజిల్లుతోంది.సుమారు ఏడు వందల సంవత్సరాల కిందట శ్రీధరుడు అనే పండితుడు ఈ కొండ గుహలను కనుగొన్నాడని చెబుతారు. ఒకరోజు శ్రీధరుడి పూజా మందిరంలోని అమ్మవారి విగ్రహం ఒకటి మాయమైపోతుంది. ఎంత వెతికినా ఆ విగ్రహం జాడ తెలియదు. దీంతో కలత చెందిన శ్రీధరుడు అమ్మవారిని ప్రార్థించగా, తాను త్రికూట పర్వతశ్రేణుల్లో వైష్ణోదేవిగా వెలిశాననీ, ఇకమీదట ఆ గుహల్లోనే తనని పూజించమనీ చెబుతుంది. అమ్మ ఆజ్ఞానుసారం గుహలను వెతుకుతూ వెళ్లగా అక్కడ మూడు రాతి విగ్రహాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ మూడు మూర్తులే మహా సరస్వతీ, మహా లక్ష్మీ, మహా కాళీ అవతారాలుగా భావించిన ఆ పండితుడు తన శేషజీవితం అంతా అక్కడే అమ్మవారిని సేవిస్తూ గడిపి, చివరికి అమ్మవారిలో ఐక్యం అయ్యాడని స్థానికుల కథనం.

ఇలా చేరుకోవచ్చు

ఈ ఆలయం జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్మూకి సుమారు అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ పర్వతశ్రేణిలో త్రికూట పర్వతపు గుహలో వైష్ణోదేవి పూజలందుకుంటోంది. అయితే ఈ ప్రాంతాన్ని నేరుగా చేరుకోవడానికి ఎలాంటి సదుపాయాలూ లేవు. జమ్మూకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా అనే చిన్న పట్టణానికి చేరుకుని, అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి వెళ్లాలి. నడవలేని వారికోసం గుర్రాలు, పల్లకీలు, హెలీకాప్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కాట్రా వెళ్లేందుకు రైలు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. విమానంలో అయితే జమ్మూ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కాట్రా వెళ్లొచ్చు. రోడ్డు మార్గంలో... దిల్లీ, దెహ్రాదూన్‌, పాటియాల, అమృత్‌సర్‌, పఠాన్‌కోట్‌ మొదలైన పట్టణాల నుంచి నేరుగా కాట్రాకు బస్సు సదుపాయం ఉంది. రైలు మార్గంలో అయితే... కోల్‌కతా, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, దిల్లీ రైల్వేస్టేషన్ల నుంచి కాట్రాకు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. 

Related Posts