YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాక రేపుతున్న దొంగ ఓట్లు

కాక రేపుతున్న దొంగ ఓట్లు

కరీంనగర్, జూలై 12, 
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఉప‌ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో టీఆర్ఎస్ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆర్డీవో కార్యాలయం కేంద్రంగా దొంగ ఓట్ల నమోదు చేపడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. స్వయంగా ఆర్డీవో నేతృత్వంలో ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులను నియమించి జమ్మికుంట, హుజూరాబాద్‌ పట్టణాలతో పాటు కొన్ని పెద్ద గ్రామాల్లో నియోజకవర్గానికి సంబంధం లేనివారిని ఓటర్లుగా నమోదు చేస్తున్నారన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయని వారిని గుర్తించి ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. తాజాగా ఒక ఇంట్లో 32, మరో ఇంట్లో 41 ఓట్లు నమోదు చేశారని.. అధికార పార్టీ నేతల ఇళ్లలోనే ఇదంతా జరుగుతోందన్నారు. హుజూరాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంట్లోనే 34 ఓట్లు నమోదు చేశారంటూ ఓటరు జాబితాను  అందజేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసుల తీరు సరిగ్గా లేదని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.మరోవైపు ఈటల ఆరోపణలను హుజూరాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గందె రాధిక తీవ్రంగా ఖండించారు. తమ ఇంటి నంబర్‌పై 34 దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమ ఇంటి నంబర్‌లో అక్క, బాబాయిలతో పాటు ఉమ్మడి కుటుంబ సభ్యులు, ఇంట్లో అద్దెకున్న వారి ఓట్లు 2018కి ముందే నమోదయ్యాయన్నారు. అవి దొంగ ఓట్లని నిరూపిస్తే స్థానిక హనుమాన్‌ ఆలయం వద్ద ముక్కు నేలకు రాస్తానని, ఒకవేళ నిరూపించకపోతే ప్రజల సమక్షంలో ఈటల ముక్కు నేలకు రాస్తారా? అని సవాల్‌ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఇంటి నంబర్‌లోని ఓట్లను వేయించుకున్న ఈటల.. ఇప్పుడు అవి దొంగ ఓట్లు ఎలా అయ్యాయో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Related Posts