హైదరాబాద్
నిరుద్యోగి కొండల్ ఆత్మహత్య బాధాకరం.. చేతికొచ్చిన పిల్లలు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపుశోకం పెట్టొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. మంత్రి గోపాల్ పేట మండలం తాడిపర్తిలో నిరుద్యోగి కొండల్ తల్లిదండ్రులు వెంకటమ్మ, రాములులను పరామర్శించి స్వయంగా రూ.లక్ష సాయం అందజేసి, డబల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాం. సాగునీటి రాకతో ప్రజలు సాగు పెరిగింది .. పంటల దిగుబడులతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకురావడం జరిగింది. ఏడేళ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం .. మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. 50 వేల ఉద్యోగాలకు 5 లక్షల మంది పోటీ పడొచ్చు .. మరి మిగిలిన 4.5 లక్షల మందికి ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుందా ? ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దని అన్నారు.