వసతి గదుల కేటాయింపు నూతన విధానంపై భక్తుల సంతృప్తి
తిరుపతి,మా ప్రతినిధి,జూలై 11,
తిరుమలలో వసతి గదుల కేటాయింపు కోసం జూన్ 12న ప్రవేశపెట్టిన నూతన విధానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో భక్తులు గదుల కోసం వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గిపోయింది.
భక్తులకు వసతి గదులు కేటాయించడంలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు ఆరు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కౌంటర్లను టిటిడి ఏర్పాటుచేసింది. సిఆర్‌వో వద్ద రెండు కౌంటర్లు, బాలాజి మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగీచా బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జిఎన్‌సి టోల్‌గేట్ వద్ద 2 కౌంటర్లను ఏర్పాటుచేశారు. జూన్ 12వ తేదీ నుండి ఈ కౌంటర్లు పనిచేస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో గదులు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సంబంధిత గదుల స్లిప్పులను తిరుపతిలోనే స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అలిపిరి టోల్‌గేట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలిపిరి టోల్‌గేట్ నుండి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్ చేసుకున్న 30 నిమిషాల్లో ఎస్ఎంఎస్ వస్తుంది. అలిపిరి నడకమార్గంలో నడిచివెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి ఒక గంటలో ఎస్ఎంఎస్ వస్తుంది. ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా భక్తులను అనుమతించడం లేదు.
ఆన్‌లైన్‌లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న భక్తులకు వచ్చే ఎస్ఎంఎస్‌లో ఉప విచారణ కార్యాలయం వివరాలుంటాయి. ఇలాంటి భక్తులు నేరుగా సంబంధిత ఉప విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చు.
అదేవిధంగా, కరంట్ బుకింగ్‌లో అయితే ముందుగా భక్తులు పైన తెలిపిన ఆరు ప్రాంతాల్లోని ఏదో ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్‌కు వెళ్లి గుర్తింపు కార్డు చూపి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి 15 నిమిషాల్లో గది కేటాయింపు ఉప విచారణ కార్యాలయం వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. భక్తులు నేరుగా సంబంధిత ఉప విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చు. గదుల అందుబాటు ప్రకారం భక్తులకు కేటాయిస్తారు.
ఈ నూతన విధానం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు నెల రోజుల్లో 70,148 గదులను భక్తులు పొందారు. ఇందులో ఏఆర్‌పి ద్వారా 35,418 గదులుండగా, తిరుమలలో కరంట్ బుకింగ్ ద్వారా 34,730 గదులు కేటాయించారు.
ఈ నూతన విధానంపై బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీ ఎం.సతీష్ స్పందిస్తూ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో సిఆర్‌వో కార్యాలయం వద్ద గంటల తరబడి గదుల కోసం వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం సొంత వాహనంలో అలిపిరి చెక్‌పాయింట్ వద్ద గది స్లిప్ స్కాన్ చేయించుకుని తిరుమలకు వచ్చానని, 40 నిమిషాల్లో తాను కౌస్తుభంలో గది పొందగలిగానని తెలిపారు. టిటిడి ప్రవేశపెట్టిన నూతన విధానం స్వాగతించదగిందని చెప్పారు.
తమిళనాడులోని శివకాశికి చెందిన శివప్రకాషన్ మాట్లాడుతూ ఏడుకొండలస్వామి తమ ఇంటి దైవమన్నారు. గదుల కేటాయింపు కోసం టిటిడి యాజమాన్యం ప్రవేశపెట్టిన విధానాలను రెండు దశాబ్దాలుగా పరిశీలిస్తున్నానని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గదుల రిజిస్ట్రేషన్ కౌంటర్లను వికేంద్రీకరించడం మంచి పద్ధతి అని స్వాగతించారు. గతంలో సిఆర్‌వో వద్ద భారీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని, ఈసారి అతి తక్కువ సమయంలోనే ఎంబిసి ఏరియాలో గది లభించిందని చెప్పారు.