విశాఖపట్టణం, జూలై 13,
తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ చూడని సన్నివేశాలు ఇపుడు కనిపిస్తున్నాయి. ఒకపుడు చంద్రబాబు మాటే శిలాశాసనం. ఆయన ఏది చెబితే అదే ఫైనల్. చంద్రబాబు మాటను జవదాటాలంటే అది దుస్సాహసమే. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడి పోయిన తర్వాత పార్టీలో కొట్టొచ్చినట్లుగా కనిపించే మార్పు ఏంటి అంటే క్రమశిక్షణారాహిత్యం. టీడీపీలో ప్రతీ వారూ నాయకులుగా మారిపోతున్నారు. అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు విశాఖ టీడీపీలో భీమిలీ సీటు పెద్ద పేచీనే పెడుతోంది.విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పాశర్ల ప్రసాద్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చేశారు. ఆ విధంగా ఆయన మీడియాకు ఎక్కడం వింత అయితే ఆయన్ని చంద్రబాబు నుంచి విశాఖ నాయకుల వరకూ అందరూ బుజ్జగించి దారికి తేవడం విడ్డూరం. నిజానికి టీడీపీలో ఇలాంటి సీన్లు ఎవరూ చూసి ఉండరు. కాంగ్రెస్ కల్చర్ గా వీటిని చెబుతారు. మొత్తానికి బడా నాయకులు అంతా పాశర్ల ఇంటికి వెళ్ళి నచ్చచెప్పి ఆయన రాజీనామా అస్త్రాన్ని విరమించుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.ఈ మధ్య భీమిలీ సీటుకు టీడీపీ తరఫున ఇంచార్జిని చంద్రబాబు ప్రకటించారు. మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాశర్లకు మండుకొచ్చింది అంటున్నారు. ఆయన భీమిలీ మీద కన్నేశారు. అటు చంద్రబాబు, ఇటు నందమూరి బాలయ్యల కనుసన్ననలో ఉంటూ సీటు కోసం కాస్తా గట్టిగానే కృషి చేస్తున్నారు. సబ్బం హరి మరణం తరువాత అక్కడ ఇంచార్జిని తానే అవుతాను అని భావించారు. కానీ సడెన్ గా రాజబాబుని ప్రకటించేసరికి షాక్ తిన్న పాశర్ల హై కమాండ్ కే షాక్ ఇచ్చేశారు అంటున్నారు. తాను టీడీపీలో ఉండలేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.టీడీపీకి ఆయువు పట్టు క్రమశిక్షణ. నిజానికి ఒక వైపు సీనియర్లు కొందరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. జూనియర్లు కట్టు దాటుతున్నారు. కొన్ని సీట్లకు పోటీ చేయడానికి క్యాండిడేట్లు వెతుక్కోవాల్సి వస్తే మరి కొన్ని సీట్లకు మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. అయినా ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. ఈ లోగా ఎన్నో మార్పులు వస్తాయి. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలను చూడడానికి ఇంచార్జిలను నియమిస్తే ధిక్కరిస్తూ పాశర్ల లాంటి సీనియర్లు రచ్చ చేయడం తగునా అన్న మాట వినిపిస్తోంది. పాశర్లను బుజ్జగించడానికి చంద్రబాబు నుంచి పెద్ద నాయకులు రంగంలోకి దిగిపోయారు అంటే పార్టీ ఎక్కడికి పోతోంది అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇవాళ ఈయన ఇలా చేస్తే రేపు మరో ఆయన ఇదే విధంగా షాక్ ఇస్తారు, ఇలా ఎంతమందిని బుజ్జగిస్తారు, పార్టీలో క్రమశిక్షణ లేకుంటే పరిస్థితి ఎలా అన్నదే అందరికీ బెంగ పట్టుకుంది. మొత్తానికి టీడీపీలో ఎన్నడూ చూడని విచిత్ర వాతావరణం మాత్రం కళ్ళకు కడుతోందిపుడు. కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్నారన్నదే నిజం.