YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగు తిప్పలు

తెలుగు తిప్పలు

విజయవాడ, జూలై 13, 
తెలుగు భాషాభివృద్ధి కుంటుపడుతోందని ఒక వైపు భాషాభిమానులు బాధ పడుతున్న పరిస్థితి ఉంది. మరో వైపు కేవలం ఉపాధి కోసం చదువులు అన్నట్లుగా తయారైన విద్యా వ్యవస్థలో మాతృ భాషలో బోధన తగ్గిపోతోంది. నిష్టూరమైనా ఇదే నిజం. అందరికీ తెలుసు తెలుగుకు తెగులు పట్టిందని, కానీ కోరి మారీ ఆ నేరాన్ని తమ మీద వేసుకోవడమే వైసీపీ పాలకులు చేస్తున్న పని. జగన్ అధికారంలోకి వచ్చకా తెలుగు భాషలో ప్రాధమిక విద్యా బోధనకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. అది అతి పెద్ద దుమారమే లేపింది. కోర్టులలో కూడా ప్రజావ్యాజ్యాలు పడ్డాయి. ఇపుడు దానికి తోడు అన్నట్లుగా మరో వివాదానికి వైసీపీ సర్కార్ తావిచ్చింది.విభజన జరిగి ఏడేళ్లు అయినా తెలుగు అకాడమి ఆస్తుల వ్యవహారం తేలలేదు. విజయవాడలో ఆఫీస్ పెట్టి ఏపీ తెలుగు అకాడమీని నిర్వహిస్తున్నారు. దీని మీద సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ఇదిలా ఉండగానే అకస్మాత్తుగా తెలుగు అకాడమి పేరుని జగన్ ప్రభుత్వం మార్చేసింది. తెలుగు సంస్కృత అకాడమీ అంటూ కొత్త పేరుతో జీవో రిలీజ్ చేసింది. దీంతో భాషాభిమానులు మండిపోతున్నారు. తెలుగుకు ఇదేం ప్రారబ్దం అని వారంతా మదన పడుతున్నారు. ఎంతో చరిత్ర ఉన్న అకాడమీని ఇలా చేయడమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు.ఆరవ దశకంలో పీవీ నరసింహారావు తొలి అధ్యక్షుడిగా తెలుగు అకాడమీ మొదలైంది. ఆ తరువాత అనేక మంది పనిచేశారు. ఏటా వేలల్లో తెలుగు పుస్తకాలు ప్రచురిస్తూ తెలుగు వెలుగులు విరజిమ్ముతోంది. అటువంటి అకాడమీ పేరుని మార్చడం బాధాకరమనే అని అంటున్నారు. జగన్ ముందు తెలుగు చరిత్ర తెలుసుకోవాలని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ అంటున్నారు. జనసేనాని కూడా వైసీపీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇపుడు అంత అవసరం ఏమొచ్చింది అని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ సంస్కృత భాష మీద మోజు ఉంటే దానికి వేరే అకాడమీ ఏర్పాటు చేయవచ్చుగా అన్న మాట కూడా అంటున్నారు.తెలుగుదేశం పార్టీతో ఎపుడూ వైసీపీకి రాజకీయ పోరు ఉండనే ఉంది. ఇపుడు తెలుగు అన్న మాట వింటేనే సమరానికి తయారైపోతారా అంటున్నారు భాషాభిమానులు. పాఠశాలలు తెరచుకుంటున్న వేళలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తెలుగును ఏం చేయదలచుకున్నారో ముందే చెబుతున్నారా అని నిలదీస్తున్నారు. తన పంతం నెగ్గించుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఏకంగా తెలుగు వైభవానికే చేటు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే భాష, ప్రాంతం, కులం, మతం ఇవన్నీ బలమైన సెంటిమెంట్లే. వీటి జోలికి తెలిసి ఏ రాజకీయ పార్టీ పోదు. కానీ వైసీపీ సర్కార్ ఎందుకిలా చేస్తోంది అన్నది సొంత పార్టీలోనే చర్చగా ఉంది. ఈ పేరు మార్పు వల్ల ఒరిగేది ఏంటో కానీ భాషాభిమానుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని, తెలుగు అంటేనే వైసీపీకి వెగటా అన్న భావన కూడా బలపడిపోతోందని విమర్శలు వస్తున్నాయి. మరి జగన్ దీని మీద పునరాలోచిస్తే బాగుంటుందేమో.

Related Posts