ముంబై, జూలై 13,
కరోనాతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధించినా.. దాని ప్రభావం ఆర్థిక వ్రుద్ధిపై కనిపించినా ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం తీపి కబురందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రెట్టింపయ్యాయి. రూ.2.49 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకించి పర్సనల్ ఇన్‌కం టాక్స్, అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు జరిగాయని ఆదాయం పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెల మూడో తేదీ వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ.2.49 లక్షల కోట్లకు చేరాయి.గతేడాది ఇదే నెలలో కేవలం రూ.1.29 లక్షల కోట్ల పై చిలుకు వసూలయ్యాయి. దీని ప్రకారం పన్ను వసూళ్లు 91 శాతం పెరిగాయి. కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా 2021-22 నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దృఢంగా పుంజుకున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే టైంలో గతేడాది రూ.1.94 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇందులో కార్పొరేట్ ఇన్‌కం టాక్స్, పర్సనల్ ఇన్‌కం టాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్ఐటీ) ఉన్నాయి.ప్రత్యక్ష పన్ను వసూళ్ల ధోరణి ప్రోత్సాహకరంగా ఉందని ఐటీ విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించిన పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోగలమని భావిస్తున్నాయి. పారదర్శకమైన, ఫెయిర్ టాక్సేషన్ విధానం విశ్వాసం పెంచుతుందని ఆ వర్గాల కథనం.