థర్డ్ వేవ్ ను నిలువరించాలంటే..వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలి
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రులతో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ జూలై 13
కరోనా సెకండ్ వేవ్‌లా థర్డ్ వేవ్ కూడా విజృంభించకుండా నిలువరించాలంటే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రులతో ప్రధాని మోదీ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే మనం మహమ్మారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలి. కరోనా వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలి. కొత్త వేరియంట్లపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. కరోనా నిబంధనలను పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.’’ అని అన్నారు. అదేవిధంగా కరోనా మహమ్మారి అనేక రూపాలు సంతరించుకుంటున్నదని, వాటిపై మనం ఓ కన్నేయాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సిన్ పై ప్రజల్లో అపోహలు తొలగించాలని ఆయన అన్నారు. కరోనా వేయింట్లపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, మనందరం కూడా కరోనా నిబంధనలు పాటించడంతోపాటు ప్రజలు కూడా పాటించేలా ప్రోత్సహిద్దామని ఆయన ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా థర్డ్ వేవ్ ప్రబలకుండా కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు కరోనా నిబంధనలను సరిగా పాటించడంలేదని, ఇది ఆందోళనకరమైన విషయమని ముఖ్యమంత్రులతో ప్రధాని వ్యాఖ్యానించారు. హిల్ స్టేషన్స్‌కు వచ్చే పర్యాటకులలో చాలా మంది ఫేస్ మాస్కులు ధరించడంలేదని, సామాజిక దూరం కూడా పాటించడం లేదని ప్రధాని చెప్పారు. హిల్ స్టేషన్స్‌లో, మార్కెట్‌లలో ఫేస్ మాస్కులు లేకుండా జనం భారీ సంఖ్యలో గుమిగూడటం మంచిది కాదని, ప్రజలు తూచా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ముఖ్యమంత్రులకు సూచించారు. 23 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక ఈ సమావేశంలో అసోం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.