విజయవాడ, జూలై 14,
మొత్తానికి రెండేళ్ళ తరువాత జగన్ కి తత్వం బోధపడిందిట. టాలీవుడ్ ని ఎంత పిలిచినా ఏపీకి రావడం లేదు. పైగా వారంతా తారలు. ఎక్కడో సదూర ఆకాశంలో అలా మెరుస్తూ ఉంటారు. వారు అన్నింటికీ అతీతులు. దాంతో ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టాక ఒకే ఒక్క భేటీ తప్ప ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి విషయంలో అడుగు ముందుకు పడలేదు. పైగా ఎంతసేపూ కేసీయార్ కి బాసటగా నిలుస్తూ హైదరాబాద్ కే ప్రయారిటీ ఇవ్వడం కూడా జగన్ కి ఆగ్రహం తెప్పించింది అంటున్నారు. టాలీవుడ్ ని దారిలోకి తెచ్చుకోవడం కోసమే జగన్ వకీల్ సాబ్ టికెట్ల విషయంలో అతి పెద్ద షాక్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పటిదాకా పెద్ద హీరోల సినిమాలకు ఇష్టారాజ్యంగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే ఛాన్స్ ఉండేది. దాన్ని ప్రభుత్వం అనుమతించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సంబంధం లేకుండా తమ కలెక్షన్ల పంట పండించుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ సర్కార్ అంటే పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక చర్యతో ఇపుడు టాలీవుడ్ వెంట పడుతోంది. తాజాగా ఏపీ సర్కార్ ఒక జీవో విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే పెద్ద బడ్జెట్ సినిమాల విషయంలో రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటే ప్రభుత్వ పెద్దలని తప్పనిసరిగా కలవాల్సిందే. ఇది ప్రతీ సినిమా విషయంలోనూ చేయాల్సిందే. అంటే ఏ హీరోకు ఆ హీరో ఇక మీదట సర్కార్ పెద్దలతో బాగా టచ్ లో ఉండాలన్న మాట. లేకపోతే మామూలు ధరలే అమలవుతాయి. ఇక టాలీవుడ్ లో చూసుకుంటే అన్నీ హై బడ్జెట్ మూవీస్ గా వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. దాంతో జగన్నామస్మరణతో టాలీవుడ్ ఇపుడు తరిస్తోంది. జగన్ అపాయింట్మెంట్ కోసం ఇపుడు టాలీవుడ్ బడా బాబులు క్యూ కడుతున్నారుట. సినిమా పరిశ్రమ సమస్యలు చర్చించాలి అని అర్జీలు పెట్టుకుంటున్నారు. అయితే జగన్ ఇపుడు అపాయింట్మెంట్ ఇచ్చినా తాను అనుకున్న దాని నుంచి వెనక్కు పోరు అంటున్నారు. బడా సినిమాలు, పెద్ద హీరోల విషయంలో జీవో ఆధారంగానే రేట్ల పెంపు అమలుకే సర్కార్ కట్టుబడి ఉందని అంటున్నారు. అలా చేస్తేనే టాలీవుడ్ ఏపీ వైపు చూస్తుంది. ఇక్కడ జనాలతో కనెక్షన్లు కూడా బాగుంటాయని భావిస్తున్నారుట. మొత్తానికి జగన్ గట్టి నిర్ణయంతో టాలీవుడ్ విలవిలలాడుతోంది మరి.