YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముందుకు సాగని జగనన్న కాలనీలు

ముందుకు సాగని జగనన్న కాలనీలు

విజయవాడ, జూలై 14, 
జగనన్న స్మార్ట్‌ సిటల పేరిట ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించి ''నో లాస్‌- నో ప్రాఫిట్‌'' కింద మధ్య తరగతి ప్రజలకు ఇంటి స్థలాలను అమ్మాలని నిర్ణయించింది. లే అవుట్లకు నగరానికి మూడు కిలోమీటర్లలోపు దూరంలో భూములు కొనుగోలు చేయాలని భావించినప్పటికీ ప్రధాన నగరాలకు దగ్గర్లో అందుబాటులో భూములు లేని పరిస్థితి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, నెల్లూరు, ఒంగోలు నగరాలతో పాటు పలు మున్సిపాల్టీల్లో కూడా భూములు సేకరించడం అధికార యంత్రాంగానికి కష్టంగా ఉంది. భూముల సేకరణ ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ జగనన్న స్మార్ట్‌ సిటీలో లే అవుట్లు వేసే ప్రక్రియ మరింత వెనక్కు పోతోంది. ఒక్కో మున్సిపాల్టీలో 25నుంచి 150 ఎకరాల్లో వెంచర్ప్‌ వేయాలని ప్రభుత్వం భావించింది. భూములు సేకరించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా భూములు లభ్యత కాక పోతుండటంతో జిల్లా స్ధాయి అధికారుల పరిస్థితి ''కరవమంటే కప్పకు కోపాం విడవమంటే పాముకు కోపం'' అనే చందాన తయారైంది. '' నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు'' పధకంలో అర్హులైన పేదలకు ఒక సెంటు స్థలం ఇవ్వడానికే భూ సేకరణ కష్టంగా మారగా, నగరం, మున్సిపాలిటీ పరిధిలో భూములు సేకరించడం తలకు మించిన భారమని అధికారులంటున్నారు.ఏప్రిల్‌ నెలలో ఈ పధకానికి రూపకల్పన జరగ్గా ఈ పధకానికి సంబంధించి ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదని సమాచారం. అర్హులైన మధ్యతరగతి వర్గాల ప్రజలకు సంబంధించి ఎంత మందికి లే అవుట్లలో ప్లాట్లు అవసరమో గుర్తించేందుకు వార్డు వాలంటీర్లు, టౌన్‌ప్లానింగ్‌ సెక్రటరీ విభాగంలోని సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి డిమాండ్‌ను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి రెండున్నర నెలలు దాటినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క నగరంలోకూడా లే అవుట్లకు శ్రీకారం చుట్టిన దాఖలాల్లేవు. ప్రభుత్వం అనుకున్నట్లు భూములు కొనుగోలు ప్రక్రియ పూర్తయితే ఎంఐజి(మధ్య తరగతి లే అవుట్‌ పధకం)లోని మూడు కేటగిరీలకు వారి వార్షిక ఆదాయాన్ని బట్టి లే అవుట్లలో ప్లాట్లను కేటాయిస్తారు. కనీసం దసరా నాటికైనా ప్లాట్లు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయో లేదోననే చర్చ ప్రజల్లో నడుస్తోంది.

Related Posts