హైద్రాబాద్, జూలై 14,
ఆర్‌టిసి సమ్మె తర్వాత కుదురుకుంటున్న ఆర్‌టిసి కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు నడవకపోవడంతోపాటు ప్రభుత్వ తీసుకున్న సగం జీతం నిర్ణయంతో వారు ఆర్ధికంగా తీవ్రంగా నష్ట పోతున్నారు. డిపోల్లో పనిచేసే కార్మికులందరికీ అన్ని రోజులు డ్యూటీలు లేకపోవడంతో అరకొర జీతాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. జూన్ నెలలో అయినా పరిస్థితి మెరుగుపడుతుందని భావించిన కార్మికులు పే స్లిప్పులు చూసి తలలు పట్టుకొంటున్నారు. తమకు రూ.7 వేలు మాత్రమే వచ్చాయి అని కొందరు చెప్పగా, చాలా మంది రూ.5 వేలకు మించి జీతాలు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం చేస్తామని ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసిలో 49 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. బస్సులు పూర్తిస్థాయిలో నడవకపోవడం వల్ల ఉద్యోగులందరిని విధుల్లోకి తీసుకోవడం లేదు. పని చేసిన రోజులకే వేతనం చెల్లిస్తున్నారు. ఫలితంగా రూ.100 కంటే తక్కువ నుంచి రూ.వెయ్యి లోపు జీతం వచ్చిన ఉద్యోగులు ఉన్నారు. చాలా మందికి రూ.4 వేల నుంచి రూ.5 వేల జీతం వచ్చింది. భద్రాచలం డిపోలో పని చేస్తున్న ఓ ఉద్యోగి తనకు కేవలం రూ.7 వేతనం మాత్రమే వచ్చిందని పేస్లిప్ చూపించారు. ఇదే డిపోలో మరో కార్మికుడు రూ.57 వచ్చిందని వాపోగా, ఇంకొక ఉద్యోగి రూ.77 వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు తనకు రూ.999 మాత్రమే వేతనం వచ్చిందన్నారు. ఈ జీతాలపై ఎంప్లాయిస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులు ఎలా బతుకుతారని ప్రశ్నించింది. ఆర్‌టిసిలో కార్మికసంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కార్మికులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి దాపురించిందని పలువురు డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు.