తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ సమన్వయ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచారణపై సమాలోచనలు జరిపారు. ఇప్పటికే తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభ తరహాలోనే మరో 12చోట్ల భారీ సభలు నిర్వహించనున్నట్టు నేతలు వెల్లడించారు. ఈ నెలలోనే విశాఖలో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరిలో చివరి సభను అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో తెదేపా గెలిచేలా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాజపా వైఖరి ప్రస్తావన రాగా.. జగన్, గాలి జనార్దన్‌రెడ్డి కేసులు నీరుగారుస్తుండటం కేంద్ర ప్రభుత్వ నయవంచనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు కళావెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల వరకు నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ పోరాటాన్ని మొత్తం 13 జిల్లాల్లోనూ కొనసాగిస్తామని స్పష్టంచేశారు. జనవరి నెలలో అమరావతిలో భారీ సభతో కార్యక్రమం ముగిస్తామన్నారు. అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతా కలిసి పోరాటం చేయాల్సిన సమయంలో వైకాపా అసలు పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం భాజపా డైరెక్షన్‌లో చేస్తోందని మండిపడ్డారు. చాలా దుర్మార్గమైన ధోరణితో వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్రభవిష్యత్తును ఫణంగా పెడుతోందని ఆరోపించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు’పై అన్ని జిల్లాల్లో ధర్మపోరాటానికి తెదేపా రంగం సిద్ధం చేసింది. అలాగే, విజయవాడలో మహానాడు జరుపుకోవాలని కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.