YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కరోనా సాకుతో రోడ్డున పడ్డ చిరుద్యోగులు

కరోనా సాకుతో రోడ్డున పడ్డ చిరుద్యోగులు

హైద్రాబాద్, జూలై 14, 
ఏళ్ల తరబడి కూర్చొని చదువుతున్నా సర్కారు భర్తీ చేస్తున్న కొలువులు అంతంతే. ఇంట్లో ఆర్థిక సమస్యలు తాళలేక... దొరికిన పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొందరైతే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తే ఎప్పటికైనా పర్మినెంట్‌ కాకపోదా! అన్న చిన్న ఆశతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో చేరి బతుకు బండి లాగిస్తున్నారు. ఏటేటా రెన్యువల్‌ చేస్తారనే భరోసాతో ముందుకు సాగుతున్న ఆ ఉద్యోగులకు ఇప్పుడు కష్టకాలమొచ్చింది. కరోనా సాకుతో ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం క్రమేణా తొలగిస్తోంది. దీంతో వేలాది మంది చిరుద్యోగులు రోడ్డునపడుతున్నారు. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో 2.5 లక్షలకుపైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే. తాము చదువుకున్న స్థాయికి కొలువులు రాలేదు. అదే సందర్భంలో రాష్ట్రప్రభుత్వం కూడా ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదు. చేసినా, ఏదో మొక్కుబడిగా కొన్ని పోస్టులను నింపి మమా అనిపించుకుంటున్నది.ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో పనిచేస్తున్నారు. వీరంతా రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం పొందుతున్నవారే. ప్రభుత్వ పథకాల అమలులో, ప్రజలకు సేవలు అందించడంలో తమ వంతు బాధ్యత పోషిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మెడపై కత్తిపెట్టి మరీ కరోనా సాకుతో తీసేస్తున్నది. కొన్నిశాఖల్లో రెన్యూవల్‌ చేయకుండా తొక్కిపెడుతున్నది.
దేశానికే తలమానికం అని చెబుతున్న మిషన్‌ భగీరథలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ట్యాంకులు కట్టించే దగ్గర నుంచి పైపులైన్లను వేయించే పనుల పర్యవేక్షణ వరకు ప్రతిఒక్కటీ దగ్గరుండి మరీ పనిచేశారు. పల్లెపల్లెకు నీరందించే ఈ పథకం భవిష్యత్‌లోనూ విజయవంతంగా కొనసాగాలంటే వీరి పాత్ర కీలకం. వీరిని పర్మినెంట్‌ చేస్తారనే ప్రచారమూ అప్పట్లో జరిగింది. కానీ, ఏ నోటీసూ లేకుండా జూన్‌ 30న ఉన్నపళంగా తీసేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్‌ జారీ చేసింది. దీంతో 700 మందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. 15 ఏళ్ల నుంచి పన్జేస్తున్నాం.. మాకు సౌకర్యాలు కల్పించండి.. వేతనాలు పెంచండి.. అని కోరితే ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న 7,500 మందికిపైగా ఫీల్డు అసిస్టెంట్లను నిర్దాక్షిణ్యంగా వద్దని చెప్పేసింది. ఉమ్మడి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టరేట్లలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను జిల్లా అధికారులు తొలగించేస్తున్నారు. ఉద్యానవన శాఖలోని 500 మందిని మే నెలలో బయటకు పంపిన విషయం విదితమే. టూరిజం శాఖ ఆదాయం పెంచడంలో నాలుగు వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఆ శాఖలోని సూపర్‌వైజర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, తదితరులకు సగం వేతనమే ఇస్తున్నది. సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ)లకు నాలుగు నెలల నుంచి పనే చెప్పట్లేదు. వేతనాలు ఇవ్వట్లేదు. రాష్ట్రంలోని బిసి వెల్ఫేర్‌, ఎస్‌సి, ఎస్‌టి వెల్ఫేర్‌ హాస్టళ్లు, గురుకులాల్లో పనిచేస్తున్న 10,500 మందికి రెన్యూవల్‌ చేయలేదు. చాలా శాఖల్లోనూ జులై చివర్లోగానీ, ఆగస్టుల్లోగానీ తొలగించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్నది. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత వీరందరి అవసరమూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు పని లేదని చెబుతూ తీసేయడం దారుణమనే విమర్శలు వస్తున్నాయి.

Related Posts