YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

పౌర సరఫరాల శాఖ,వ్యవసాయ శాఖలో పూర్తిఉద్యోగాలు భర్తీ

పౌర సరఫరాల శాఖ,వ్యవసాయ శాఖలో పూర్తిఉద్యోగాలు భర్తీ

పౌర సరఫరాల శాఖ,వ్యవసాయ శాఖలో పూర్తిఉద్యోగాలు భర్తీ
   # వచ్చే సంవత్సరం మరింతగా పెరుగనున్న  ధాన్యం ఉత్పత్తి
      #  ధాన్యం నిలువ,మార్కెటింగ్ పై పూర్తిస్థాయిలో దృష్టి
      # రైతుల‌కు స‌మ‌గ్రంగా శిక్ష‌ణ‌
      # కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
      # ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
హైద‌రాబాద్ జూలై 14
ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రెండో రోజు జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో వ్య‌వ‌సాయ శాఖ‌పై చ‌ర్చించారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను నింపుకోవాలని కేబినెట్ ఆదేశించింది.  గ‌త ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్య‌వ‌సాయ ప్ర‌స్థానం, అది సాధించిన ఘ‌న విజ‌యాల‌ను బుధ‌వారం జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సీఎం కేసీఆర్ మంత్రుల‌తో ప్ర‌స్తావించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువులకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మల్లించిందని సీఎం తెలిపారు. గ్రామాల్లో ఒక్క ఎక‌రం కూడా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. పెద్దఎత్తున రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు కేబినెట్‌కు సమగ్రంగా వివరించారు. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాల పై కేబినెట్ చర్చించింది.తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థుతులు రాష్ట్రంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్ చేయడం పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుత వానాకాలం కోటీ నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనున్నదని, వరి పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండ‌నున్నాయ‌ని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. రైస్ మిల్లులలో మిల్లింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్ మిల్లులు, పారబాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలన్నారు. ఇందుకు సంబంధించి అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను సీఎం ఆదేశించారు.రాష్ర్టంలోని రైతాంగానికి పంట పెట్టుబ‌డి సాయం రైతు బంధు స‌హా స‌కాలంలో ఎరువులు, విత్త‌నాల‌ను అందిస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. ఇలా అన్ని ర‌కాల చ‌ర్య‌ల ఫ‌లితంగా గ‌త సంవ‌త్స‌రం తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో 3 కోట్ల ట‌న్నుల ధాన్యం ఉత్ప‌త్తి చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. కరోనా క‌ష్ట‌కాలంలో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా.. గ్రామాల్లోకి వెళ్లి ప్ర‌భుత్వ‌మే ధాన్యాన్ని కొనుగోలు చేసింద‌ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
రైతుల‌కు స‌మ‌గ్రంగా శిక్ష‌ణ‌
రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావాలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని, అందుకు అవసరమైన రీతిలో అధికారులను, నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాల‌ని ఆదేశించింది. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని కేబినెట్ సూచించింది. నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.
కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్ననేపథ్యంలో.. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

Related Posts