సీబీఐకి చివరి అవకాశం..
26వ తేదీకి కేసు వాయిదా
విజయవాడ, జూలై 14,
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రస్తుత ఏపీ సీఎంవైఎస్ జగన్ వేల కోట్ల అక్రమాస్తులు పోగేశారన్న ఆరోపణలతో జైలుకెళ్లాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడంతోనే ఆయనపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. విచారణ పేరుతో పిలిపించి సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. జగన్ బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించడంతో ఆయన 14 నెలల జైలు జీవితం గడపాల్సి వచ్చింది.తదనంతరం ఆయన బయటికి రావడం.. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం తెలిసిందే. ఇంతవరకూ బాగానే ఉన్నా సొంత పార్టీ ఎంపీ రఘు రామకృష్ణ రాజు ధిక్కార స్వరం అందుకోవడం అధినేతకు చికాకు తెప్పిస్తోంది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో ఆగని రఘురామ.. ఏకంగా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసి సంచలనం రేపారు. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని.. వెంటనే బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మరింత హీట్ రాజేసింది. అయితే పాత పాయింట్‌తోనే ఫైట్‌కి దిగారు ఎంపీ రఘురామ. జగన్ సాక్ష్యులను, నిందితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ పాత పాయింట్‌నే లేవదీశారు. సీబీఐ కోర్టులో సీరియస్‌గా వాదనలు వినిపించిన పిటిషనర్ తరఫు లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సాక్ష్యులు, నిందితులుగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారని తెలిపారు. సీఎం జగన్ వారిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని సీఎం జగన్ వేధింపులకు గురిచేశారని గుర్తు చేశారు. అదే తరహాలో ఐఏఎస్ అధికారులను ప్రభావితం చేసే అవకాశముందని లాయర్ కోర్టుకు తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరును పర్యవేక్షించే బాధ్యత సీఎస్ పరిధిలో ఉంటుందని.. ఆ అధికారాలను ప్రత్యేక జీవో ద్వారా సీఎం బదిలీ చేసుకున్నారని వివరించారు. దీంతో సాక్ష్యులుగా ఉన్న అధికారులను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు.
అలాగే జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించకపోవడాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజుల సమయం కావాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. ఇప్పటికే రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. ఇక అవకాశం ఇవ్వొద్దని పిటిషనర్ వాదించారు. అయితే సీబీఐ దర్యాప్తు సంస్థ అయినందున చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. విచారణను ఈ నెల 26 వ తేదీకి వాయిదా వేసింది