YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 మళ్లీ పలుగు, పార పడుతున్న పట్న వాసులు

 మళ్లీ పలుగు, పార పడుతున్న పట్న వాసులు

 మళ్లీ పలుగు, పార పడుతున్న పట్న వాసులు
మెదక్, జూలై 15,
రాష్ట్రంలో కరోనా కరాళనృత్యమే చేస్తోంది. గత మూడు నెలలుగా ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయుల బతుకు బండలైంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. లాక్‌డౌన్ సడలింపులిచ్చినప్పటికీ జిహెచ్‌ఎంసీలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దరిమిలా జిహెచ్‌ఎంసీలో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారం విస్తృతస్థాయిలో కొనసాగింది. వ్యాపార, వాణిజ్య, ఇతరత్రా కంపెనీలు తమ ఉద్యోగుల సం ఖ్యను సగానికి సగం కుదించేశాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారంతా తమ పిల్లలతో సహా ఇప్పటికే సొంతూళ్ల బాట పట్టేశారు. మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రచారంతో మిగతా సగం జీతంతో బతికే వారు సైతం తాము రాజధాని హైదరాబాద్‌లో ఉండేకన్నా సొంతూళ్లు వెళ్లడమే మేలని భావిస్తుండటం గమనార్హం.ఇంకో వైపు హైదరాబాద్‌ను కరోనా కమ్మెస్తోంది. తాను ఎంటరైతే ఎవరైనా తనకు ఒకటేనన్న చందంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రానున్న కాలంలో ఈ మహమ్మారి మరింతగా చెలరేగిపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్ ఇప్పుడిప్పుడే తెరిచే అవకాశాలు మృగ్యం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎన్నోఏళ్లుగా ఎందరికో జీవనోపాధి కల్పిస్తూ వస్తోంది. మధ్యప్రదేశ్, బీహర్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే వివిధ రకాల కొలువులు చేస్తూ స్థిరపడ్డారు. కరోనాతో ఇప్పుడు వీరి జీవితాలు అంధకార బంధురమే అయ్యాయి. తమ బతుకుబండి ఏ విధంగా కొనసాగుతుందో తెలియని అయోమయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారిన పట్టభద్రులంతా నేడు తమ తమ గ్రామాలకు చేరుకుని వ్యవసాయ పనులలో నిమగ్నమవుతున్నారు.ఎంఎస్‌ఆర్‌ఈజీ ఉపాధి హామీ పని కింద పలుగు, పార పట్టుకుని పొలాల్లో దిగి మరీ పొలం పనులు చేస్తూ దర్శనమిస్తున్నారు. జీవనోపాధి నిమిత్తం పట్టణాలకు వెళ్లిన వారంతా నేడు తమ స్వగృహాలకు చేరుకుని తమకు చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుండటంతో వారి తల్లిదండ్రులు విస్మయం వ్యక్తపరుస్తున్నారు. కరోనా మళ్లీ తమ కుటుంబాలను కలిపిందన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు సైతం ఇదే పనిలో నిమగ్నం కావడం గమనార్హం. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సగం ఖాళీ అయిందని అంటున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చి జాబ్ చేయడమంటే స్టేటస్‌గా పరిగణించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇక్కడే ఉండి కరోనా కాటుకు బలవ్వడం కంటే తమ సొంతూళ్లలో బతుకుబండి కొనసాగింపునకే పలువురు ప్రాధాన్యతనిస్తున్నారనేది స్పష్టమైంది. ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు మూతపడిన తరుణంలో ఉపాధ్యాయుల పరిస్థితి మరింత అధ్వాన్నమనే చెప్పవచ్చు. గతంలో వివిధ స్థాయిల్లో రెండంకెలు, మూడంకెలతో జీతాలను పొందిన ఉపాధ్యాయులంతా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ ప్రాంతాల్లో చిరు ఉద్యోగులుగా అవతారమెత్తుతున్నారు.ఎలాంటి భేషజాలకు తావివ్వని రీతిలో ఉపాధ్యాయులలో కొందరు టిఫిన్ బండ్లపై ఇడ్లీ, దోసెలు వేసుకుంటూ తద్వారా జీవనోపాధి పొందుతున్నారు. వచ్చే రోజువారి మిగులు రూ.200తో తమ బతుకును నెట్టుకొస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడైతే ఇస్త్రీ నిర్వహణ ద్వారా పొట్టపోసుకుంటున్నాడు. ఇలా చిరు ఉద్యోగాలలో కొందరు.. మరికొందరైతే తమ కులవృత్తులను స్వీకరిస్తూ మరీ జీవనం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు ఉపాధ్యాయులను పలకరించిన సందర్భంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖాళీగా కూర్చోలేము కదా.. ఏదో ఒకటి చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాల్సిందేనని చెబుతున్నారు.కరోనా కల్లోలం ఒక రంగానికి పరిమితమైందనుకుంటే పొరపాటే. కరోనాతో టైలరింగ్ ఢమాల్ అయింది. దుస్తులు కుట్టించుకునేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఆసక్తి కనబర్చడంతో తమ జీవనోపాధి నిమిత్తం టైలర్లంతా దుస్తులకు స్వస్తి చెప్పి మాస్క్‌లతో కుస్తీ పడుతున్నారు. గతంలో దుస్తులు కుట్టడం ద్వారా తాము ఎంతో లాభాలను గడించేవారమని చెబుతూనే కరోనాతో పరిస్థితి తలకిందులవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితిలో వివిధ రకాల మాస్కుల తయారీలో బిజిబిజిగా ఉన్నామని టైలర్లు చెబుతున్నారు. అంతగా ఆదాయం లేకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో పొట్టనింపుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదని అంటున్నారు. హైదరాబాద్ లో గతంలో రెడిమేడ్ వస్త్రాలు కుట్టేవారు సైతం నేడు మాస్క్‌ల కుట్టడంలో బిజిగా ఉండటం గమనార్హం. ఇక్కడ సైతం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఈ విధంగా కరోనా ప్రతి ఒక్కరికి సరికొత్త పాఠాలు నేర్పుతోంది.

Related Posts