తిరుమలలో శాస్త్రోక్తంగా సర్వ పృష్టేష్టి యాగము
తిరుమల జూలై 15
లోక కల్యాణార్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో టిటిడి నిర్వహిస్తున్న శ్రౌత యాగాల్లో భాగంగా ఆరవ రోజైన గురువారం ఉదయం సర్వ పృష్టేష్టి యాగము శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహేన్ద్రయాగ పూర్వక మృగారషట్కము అనే శ్రౌత యాగాలు జూలై 10వ తేదీ నుండి జరుగుతున్న విషయం విదితమే. ఈ యాగాలు జూలై 16వ తేదీన ముగియనున్నాయి.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వేద విజ్ఞానపీఠంలో 9 మంది ప్రముఖ రుత్వికులు త్రేతాగ్నులు అనే హోమగుండాలలో అగ్నిని మదించి ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు (ఇష్టి) నిర్వహిస్తున్నారు. ఈ యాగాలు నిర్వహించడం వలన అగ్నితో మొదలై విష్ణువు వరకు సమస్త దేవతల అనుగ్రహం పొందుతారని, లోకంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉంటాయని, ఆరు ఋతువుల యందు సుభిక్షంగా ఉంటారని, సర్వ పాపాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ గురువారం ఉదయం సర్వ పృష్టేష్టి యాగము జరిగినట్లు తెలిపారు. ఈ యాగముల వలన సమస్త దిక్కులు, అన్ని రుతువులు, అందరు దేవతల అనుగ్రహం కొరకు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో ప్రధాన హోమం ముందు ప్రధానంగా అగ్నిని మదించి, మోదుగ కొమ్మ, అవుపాలు, ఆవు పెరుగు అర్పించినట్లు వివరించారు.
జూలై 10వ తేదీ మహేంద్ర యాగం :
ఇందులో ఆవు పాలు, ఆవు పెరుగుతో కలిపి ఇంద్రుడిని ఆరాధించడం వలన వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలతో లోకం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.
జూలై 11వ తేదీ పవిత్రేష్టి యాగము :
వేదం చెప్పే పండితులు ఎంత పవిత్రంగా ఉంటారో మానవులు అంతే పవిత్రంగా ఉండాలని, ఆ విధంగా ఉండేందుకు ఈ యాగము నిర్వహించినట్లు తెలిపారు. మనుషులలో తమోగుణం, రజోగుణం, పాపాలు తొలగిపోయి, నాలుగు వర్ణాలవారు వారివారి ధర్మాలను నెరవేర్చడానికి పవిత్రేష్టి యాగము నిర్వహించినట్లు చెప్పారు.
జూలై 12వ తేదీ మహా పవిత్రేష్టి యాగము :
\ ఈ యాగములో 20 మంది దేవతాలు ఉంటారని, ఇందులో 10 మంది దేవతలకు పురడాశ్రమం అనే ద్రవ్యాన్ని ఇస్తారని, 10 మంది దేవతలకు ఆజ్యం అనే ద్రవ్యం సమర్పించినట్లు తెలిపారు. అగ్నిని అనేక రూపాలుగా పూజిస్తారని, మనం తీసుకునే ఆహారాన్ని విభజించి ఇంద్రియాలకు అందిస్తారన్నారు. మహా పవిత్రేష్టి యాగములో మాత్రమే ప్రత్యేకంగా 20 మంది దేవతలు ఉంటారన్నారు.
జూలై 13న ఐంద్రావరునేష్టి యాగము:
ఇంద్రుడు, వరుణుడు కలిసిన యాగము వలన లోకంలోని మానవులు తెలిసీ, తెలియక అనేక విధములైన పాపాలు తొలగి పోవాలని ఈ యాగము నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాక్షస స్వభావం, రాక్షస వాక్కు, రాక్షస శరీరం లేకుండా ఉంటాయని వివరించారు.
జూలై 14న మిత్రవిందేష్టి యాగములో 10 మంది దేవతలు కలిసి సమస్త లోకాలకు మంచి ఫలితాలను ఇస్తారన్నారు.
జూలై 16న మృగా రేష్టి యాగం వలన మానవులు తెలిసీ, తెలియక మనస్సు, వాక్కు వలన చేసిన ఎంతటి పాపామైన తొలగిపొయేందుకు ఈ యాగము నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ యాగానికి యజమానిగా కుప్పా రామగోపాల సోమయాజులు, యజమాని పత్ని కల్పకాంబ శోమపీఠిని వ్యవహరించారు.