వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఏసీబీ సడన్ షాకిచ్చింది.! తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన క్రికెట్ బుకింగ్ వ్యవహారంలో కోటంరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలున్నాయని గతంలో ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు రెండు మూడుసార్లు ఆయన్ను పోలీసులు విచారించడం కూడా జరిగింది. తాజాగా మరోసారి ఈ వ్యవహారం ఆరా తీసి విచారణ చేపట్టింది. క్రికెట్ బుకీలకు ఎమ్మెల్యే అండగా నిలిచారని పోలీసులు నిర్ధారించారు.విజయవాడలోని హోటల్‌లో ప్రధాన బుకీ కృష్ణసింగ్ అనుచరులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి పలుమార్లు సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ బిల్లులు, సీసీ ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రధాని బుకీ కృష్ణసింగ్ దాక్కోవడానికి ఎమ్మెల్యే చోటు కల్పించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కృష్ణసింగ్ కోర్టులో లొంగిపోవడానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్ని విధాలా సహకరించారని పోలీసులు చెబుతున్నారు.ఇవన్నీ ఒక ఎత్తయితే.. కోటంరెడ్డికి కృష్ణసింగ్ ద్వారా రూ. 23లక్షలు అందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు డీజీపీ మాలకొండయ్యకు నెల్లూరు ఎస్పీ రామకృష్ణ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏసీబీ డీజీ ఠాగూర్‌కు మాలకొండయ్య లేఖ రాశారు. ఏసీబీ యాక్ట్ కింద కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. కోటంరెడ్డి ప్రభుత్వం తనపై కక్షగట్టి మరీ ఇలా చేస్తున్నారని.. ‘మంత్రి నారాయణకు ప్రేమతోనే’ నెల్లూరు ఎస్పీ ఇలా చేస్తున్నారని పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు.