YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సాగు... సాగేదెలా

సాగు... సాగేదెలా

విజయవాడ, జూలై 16, 
ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తున్న వేళ కృష్ణా నదిపై ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు కృష్ణా నదితోనే సాగు, తాగునీరు అందుతోంది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని కృష్ణా డెల్టాల కింద 50 లక్షల ఎకరాలకుపైగా కృష్ణా నీటిపై ఆధారపడిన ఆయకట్టు ఉంది. ప్రకాశం బ్యారేజి కింద కృష్ణా డెల్టాలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే నాగార్జున సాగర్‌ కింద గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 14.5 లక్షల ఎకరాలుంటే శ్రీశైలం కింద రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కనీస నీటి మట్టాల దాకా నిల్వచేయకుండా వచ్చిన నీటిని వచ్చినట్లే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో వృథాగా దిగువకు వదిలేస్తున్న తీరుపట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో డెడ్‌స్టోరేజికి పడిపోయిన ప్రాజెక్టుల్లోని నీటి మట్టాలు జూన్‌, జులైలో కురిసే వర్షాలకు, ఎగువప్రాంతం నుంచి వచ్చే వరదలకు క్రమేణా నీటి మట్టం పెరిగితే పంటకాల్వలకు నీరు ఇవ్వడం పరిపాటి. అయితే ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌, పులిచింతల రిజర్వాయర్‌లలోకి వచ్చిన నీటిని వచ్చినట్లే విద్యుత్‌ ఉత్పత్తితో దిగువకు వదిలేస్తోంది. జూన్‌ నుంచే శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం ఇప్పటిదాకా దాదాపు 24 టిఎంసిలకు పైగా రాగా, దాదాపు 20 టిఎంసిల నీటిని దిగువకు వదిలేశారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌లోకి వస్తున్న వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయినా తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నుంచి సగటున 11 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతోంది. అలాగే నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను కూడా తెలంగాణ ఖాళీ చేస్తోంది. పులిచింతల నుంచి కూడా సగటున ఏడువేల క్యూసెక్కులను విద్యుత్‌ ఉత్పత్తితో దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి వచ్చేనీటికి నిల్వచేసుకునే అవకాశం ప్రకాశం బ్యారేజిలో లేకపోవడంతో ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వృథాగా వదిలే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టుల్లో చేపట్టిన విద్యుత్‌ ఉత్పత్తిని కృష్ణానదీ యజమాన్య బోర్డు నిలిపివేయాలని చెప్పినా, ఆంధ్రప్రదేశ్‌ రైతాంగం ఆందోళన చెందుతున్నా... తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా యథేచ్ఛగా నీటిని విద్యుత్‌ ఉత్పత్తికి వాడుతున్న తీరు రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరో వైపు  శ్రీశైలం జల వివాదంపై తెలంగాణ చేస్తున్న ఆరోపణలను అడ్డుకునేందుకు రాష్ట్ర యంత్రాంగం పావులు కదుపుతోంది. అసలు ఈ ప్రాజెక్టు నీటిపారుదల రంగానికి సంబంధించినదే కాదని, కేవలం జల విద్యుత్‌ ప్రాజెక్టు మాత్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా ప్రకటించడం సరికాదని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. అందుకు తగ్గ పత్రాలను సిద్ధం చేసే పనిలో వారు నిమగమై ఉన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డులో వాదించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1960లో మొదలు కాగా 1980లో జాతికి అంకితం చేశారు. తొలుత జల విద్యుత్‌ ప్రాజెక్టుగానే నిర్మించినప్పటికీ తరువాత కాలంలో సాగు, తాగు నీటికి కూడా వినియోగించడం ప్రారంభించారు. చాలా సంవత్సరాలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీటిని సాగుకు సజావుగానే వినియోగించుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ప్రారంభం కావడం, తెలంగాణ రాష్ట్రం యదేచ్ఛగా విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తుండడంతో మరింత ముదిరింది. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్‌ కోసమే నిర్మించారని తెలంగాణ ముఖ్యమంత్రి బాహాటంగా ప్రకటించారు. ఎక్కడా సాగునీటికి అన్నది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇందుకు అనుగుణంగానే కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో దీనిని విద్యుత్‌ ప్రాజెక్టుగానే చూపించడాన్ని వారు అనుకూలంగా మార్చకుంటున్నట్లు కనిపిస్తోంది.అయితే కేంద్ర జలసంఘం రూపొందించిన నివేదికలో మాత్రం దీనిని బహుళార్ధ సాధక ప్రాజెక్టుగానే చూపించడం గమనార్హం. ఇందులోనే శ్రీశైలం కుడి గట్టు కాలువ ద్వారా వరి పంటకు సాగుపైనా ప్రస్తావించారు. పంటలకు ఉపయోగబడేలా తీసుకుంటున్న చర్యలను కూడా ఇదే నివేదికలో పొందుపరచడం గమనార్హం. నేరుగా కేంద్ర జలసంఘం నివేదికలోనే ఈ అంశాలను అధికారికంగా పేర్కొనడాన్ని ఇప్పుడు రాష్ట్ర అధికారులు కృష్ణా ట్రిబ్యునల్‌, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందు ఈ నివేదికను కూడా నేరుగా సిడబ్ల్యుసికి సమర్పించి వివరంగా చర్చించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి పలు అవార్డుల్లో నీటి పంపకాలు, ఎగువ, దిగువ రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రాజెక్టులకు ఆయా అవార్డుల్లో చేసిన కేటాయింపులు కూడా అధికారికంగా జరిగినవేనని, అందువల్ల దీనిని కేవలం విద్యుత్‌ ఉత్పాదక ప్రాజెక్టుగా మాత్రమే చూడడం సరికాదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఈ విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి, డ్రిబ్యునల్‌ దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నారు. ఇరదుకు కావాల్సిన పత్రాలను కూడా సిద్ధం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.

Related Posts