చంద్రుడి అస్థిర కదలికలతో తీర నగరాలకు ముంపు ముప్పు
న్యూ ఢిల్లీ జూలై 16
అస్థిరంగా కదులుతున్న చంద్రుడితో భూమిపై ఉన్న తీర నగరాలకు ముంపు ముప్పు తప్పదని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తాజా అధ్యయనంలో వెల్లడైంది. పర్యావరణ మార్పులతోపాటు చంద్రుడి ఈ అస్థిర చలనం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని నాసా పరిశోధకులు వెల్లడించారు. 2030వ దశకం మధ్యలో అమెరికాలోని తీరప్రాంత నగరాలు ముంపుకు గురవుతాయని వాళ్లు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం తాలూకు ఫలితాలను నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్‌లో ప్రచురించారు. వరదల వెనుక ఉన్న ఖగోళ కారణాలను విశ్లేషించడంపైనే ఈ అధ్యయనం ప్రధానంగా దృష్టి సారించింది. దీని గురించి నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వివరించారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, సముద్ర మట్టాలు పెరగడం, పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచంలోని తీర ప్రాంతాల్లో వరదల ముప్పును పెంచుతున్నాయి. దీనికి సంబంధించి నాసా సీ లెవల్ చేంజ్ టీమ్ కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది. ఈ సమాచారంతో మనం వరదల కారణంగా పర్యావరణం, ప్రజల జీవనోపాధులు ప్రభావితం కాకుండా తగిన చర్యలు తీసుకోగలం అని నెల్సన్ చెప్పారు.ఇప్పటికే అధిక ఆటుపోట్ల కారణంగా కొన్ని నగరాలు వరదల్లో చిక్కుకున్నాయని తెలిపారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) 2019లోనే ఇలాంటి 600 వరదలను రిపోర్ట్ చేసిన విషయాన్ని నాసా గుర్తు చేస్తోంది.