న్యూఢిల్లీ, జూలై 17,
దేశంలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం టీకాలు వేయడం. అయితే, ప్రభుత్వానికి టీకాలు వేయడంలో మెరుగైన ప్రణాళిక లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నదని తెలుస్తోంది మరీ ముఖ్యంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన జూన్ 21 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించిందనీ, రోజువారీ ఇనాక్యూలేషన్ తగ్గిందని అధికారిక డేటా చూపిస్తోంది. కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. జూన్ 21-27 వరకు వారంలో సగటున 61.14 లక్షల మోతాదుల టీకాలు వేశారు. అదే జూన్ 28-జులై 4 వారంలో ప్రతిరోజూ 41.92 లక్షల మోతాదులనే అందించారు. ఇక జులై 5-11 వారంలో రోజువారీ సగటు వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 34.32 లక్షలకు పడిపోయింది. వివిధ రాష్ట్రాల విషయానికి వస్తే మిశ్రమ ధోరణి కనిపించింది. హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు జూన్ 21-27 వారంలో సగటు రోజువారీ వ్యాక్సినేషన్లలో తగ్గుదలను కనబర్చాయి. అయితే, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ రోజువారి సగటు మిశ్రమంగా ఉంది. ఇటీవల కరోనా కరోనా కేసులు పెరిగిన అసోం, త్రిపురల్లోనూ వ్యాక్సినేషన్ రోజువారి సగటు తగ్గింది.కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడానికి ప్రధానంగా సరైన ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు టీకాల కొరత సైతం వేధిస్తున్నదని తెలిపారు. తాజాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంధ్రజైన్ మాట్లాడుతూ.. టీకాల కొరత కారణంగా రాష్ట్రంలో పలు వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడనున్నాయని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం రాష్ట్రాలు, యూటీల వద్ద ఇప్పటికీ 1.54 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని తెలిపింది. కానీ, కేసులు అధికంగా నమోదవుతున్న రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ మోతాదుల అవసరాన్ని పెంచాయి. లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయడానికి తమకు నెలకు మూడు కోట్ల టీకాలు అవసరం అవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సిన్ కొరతతో రాజస్థాన్‌లోని 25 జిల్లాలో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.తాము జులై నెలకు 1.5కోట్ల టీకాలు కోరగా, కేంద్రం 65 లక్షలే కేటాయించిందని రాజస్థాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఇదే పరిస్థితి ఉంది. గుజరాత్ మాత్రం తమకు తగినంతగా టీకా మోతాదులు అందాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో త్వరలోనే థర్డ్‌వేవ్ అంచనాల నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.