న్యూఢిల్లీ, జూలై 17,
పదేళ్లలో నేషనల్ హైవే (ఎన్‌హెచ్)ల పొడవు డబుల్ అయ్యింది. ముఖ్యంగా వెడల్పు ఎక్కువగా ఉండే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ లేన్లు ఉన్న హైవేల నిర్మాణం ఊపందుకుంది. 2018–21 మధ్య ఈ సెగ్మెంట్‌లో 9 వేల కి.మీల నిర్మాణం జరగడమే దీనికి నిదర్శనం. మరిన్ని రోడ్డు ప్రాజెక్ట్‌లు ఇంకా కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. తాజాగా నార్త్ ఈస్ట్రన్ రాష్ట్రాలలో హైవేలను నిర్మించడానికి 16 కొత్త ప్రాజెక్ట్‌లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం శంకుస్థాపన చేశారు. వీటి కోసం రూ. 4,148 కోట్లను ఖర్చు చేయనున్నారు. గత కొన్నేళ్ల నుంచి రెండు లేన్ల కంటే తక్కువగా ఉన్న హైవేల విస్తరణ తగ్గింది. దీన్ని బట్టి ప్రభుత్వం వెడల్పు ఎక్కువగా ఉండే హైవేలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అఫీషియల్ డేటా ప్రకారం, ఈ ఏడాది మే 31 నాటికి దేశంలో సింగిల్ లేన్ హైవేల పొడవు 29,693 కి.మీ.లుగా ఉంది. దేశంలోని మొత్తం హైవేల పొడవు 1.39 లక్షల కోట్ల కిమీలు కాగా, ఇందులో సింగిల్ లేన్‌ల వాటా 21శాతంగా ఉంది. అదే 2018 నాటికి మొత్తం హైవేల పొడవులో సింగిల్ లేన్‌ల వాటా 29 శాతంగా ఉంది. హైవేస్ మినిస్ట్రీ డేటా ప్రకారం, గత కొన్నేళ్లలో రెండు లేదా రెండున్నర లేన్‌ల హైవేల పొడవు పెరుగుతోంది. వీటి కంటే ముఖ్యంగా నాలుగు లేన్‌లు ఉన్న హైవేల పొడవు ఎక్కువగా పెరిగింది. 2011–15 మధ్య నాలుగు లేదా అంతకంటే ఎక్కువ లేన్లు ఉన్న హైవేల పొడవు ఏడాదికి సగటున 800 కి.మీలు మాత్రమే పెరిగేది. కానీ, 2015–18 మధ్య ఏడాదికి సగటున 2,233 కి.మీ లు పెరిగింది. 2018–21 మధ్య చూస్తే ఏడాదికి సగటున 3,000 వరకు విస్తరించింది. ‘వెడల్పు ఎక్కువగా ఉన్న హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎకనామిక్ కారిడార్లపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. 2024 నాటికి ఈ కేటగిరీలలో రోడ్ల విస్తీర్ణం మరింత పెరగడం చూస్తాం’ అని హైవే మినిస్ట్రీ పేర్కొంది. దేశంలోనే మొదటి కమర్షియల్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ఫిల్లింగ్ స్టేషన్‌ను నాగపూర్‌లో నితిన్ గడ్కరీ ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో ప్రజల్లో కోపం పెరుగుతోందని, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ వాడకం పెరగాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఎల్‌ఎన్‌జీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) , ఇథనాల్ బ్లెండింగ్ వంటి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ వాడకాన్ని పెంచాలని చూస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని భావిస్తోంది. ఇథనాల్‌ను వాడితే లీటర్‌పై కనీసం రూ.20 అయినా సేవ్ చేసుకోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. కానీ, పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ నుంచి ఎనర్జీ తక్కువగా రిలీజ్ అవుతుంది. వివిధ రకాల ఫ్యూయల్స్‌కూ పనిచేసేటట్టు ఇంజిన్లను కంపెనీలు తీసుకొచ్చేలా ఓ పాలసీని తీసుకొస్తామని గడ్కరీ పేర్కొన్నారు. ఇటువంటి ఇంజిన్‌లు కేవలం ఒకటి కంటే ఎక్కువ ఫ్యూయల్స్‌పైనా, వివిధ ఫ్యూయల్స్ మిక్సర్స్ పై కూడా పనిచేస్తాయి. ఇథనాల్, మిథనాల్, బయో సీఎన్‌జీ వంటివి పెట్రోల్, డీజిల్‌కు గట్టి పోటీ ఇస్తాయని, అప్పుడు పెట్రోలియం ధరలు ఆటోమెటిక్‌గా దిగొస్తాయని తెలిపారు. ఎల్‌ఎన్‌జీకి మారడం వల్ల ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని తెలిపారు. ‘ఒక డీజిల్ ఇంజిన్‌ను ఎల్‌ఎన్‌జీకి మార్చడానికి సగటున రూ. 10 లక్షలు ఖర్చవుతుంది. ఒక ట్రక్ ఏడాదికి సగటున 98 వేల కి.మీలు తిరుగుతుంది. ఎల్‌ఎన్‌జీకి మారడం వలన ఫ్యూయల్‌పై ఖర్చులు 9–10 నెలల్లోనే రూ. 11 లక్షల వరకు మిగులుతాయి’ అని గడ్కరీ లెక్కించారు. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సెక్టార్లను ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇప్పటికే గవర్నమెంట్ ఎనర్జీ సెక్టార్లలో ప్రైవేట్ పార్టిసిపేషన్‌ను పెంచుతోందని తెలిపారు. బల్క్‌లో పెట్రోల్, డీజిల్‌ను మార్కెటింగ్ చేసుకోవడానికి పెట్రోలియం మినిస్ట్రీ గైడ్‌లైన్స్‌ను సులభం చేసింది. పెట్రోలియం మార్కెటింగ్‌లో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ పెరుగుతోంది. ‘ప్రభుత్వ కంపెనీలతో పాటు, ప్రైవేట్ కంపెనీలనూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎల్‌ఎన్‌జీని ఎవరైనా దిగుమతి చేసుకోవచ్చు’ అని తెలిపారు. ‘మనం రూ. 8 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులు తగ్గి, ఎగుమతులు పెరగాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.