YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*మన జీవితంలో జరిగేవి - జరగనివి*

*మన జీవితంలో జరిగేవి - జరగనివి*

*సాధారణంగా మన జీవితాల్లో మనకి బాగా ఇష్టం అయిన కొన్నిటిని మనం కోరుకుని అవి కావాలి రావాలి అనుకుంటే రావు. ఒక వేళ ఏదో రకంగా వచ్చినా ఉండవు. ఒక వేళ ఉన్నా అవి మనతో ఇంత కాలం ఖచ్చితం గా ఉంటాయి అని చెప్పలేము. అలాగే మనకి ఇష్టం లేని వాటిని లేదా మనకి కష్టం కలిగించే వాటిని అవి ఏలాంటి విషయాలైనా కావచ్చు లేక మనుషులే కావచ్చు, వాటిని లేదా వాళ్ళని మన నుంచి దూరంగా పోవాలి అనుకుంటాము. పోతే బాగుండు అనుకుంటాము. కానీ అవి పోవు .. వాళ్ళు పోరు. అవి ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. ఒక వేళ అవి తాత్కాలికంగా పోయినా మళ్ళీ తిరిగి వస్తుంటాయి. రావచ్చు కూడా. మన దగ్గర నుంచి పోవడానికే వచ్చినవి మనం వాటిని గట్టిగా పట్టుకున్నా, పట్టుకోవాలని ప్రయత్నించినా అవి ఉండవు. అలాగే మన దగ్గర ఉండటానికి వచ్చినవి మనం వాటిని ఎంత వదిలించు కుందామని ప్రయత్నం చేసినా అవి ఓ పట్టాన వదిలి పోవు. ఇలా మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేని ఈ రాకపోకల మధ్య లోనే మనం కష్టనష్టాలకు గురి అవుతు, సుఖ దుఃఖాల మధ్య పరిభ్రమిస్తూ ఉంటాము. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియని స్థితి లో కొట్టు మిట్టాడుతూ ఉంటాము.*

*ఈ ప్రపంచంలో కొంతమంది ఏమీ లేకపోయినా ఉన్నవాటితో తృప్తిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎన్ని వున్నా ఇంకా ఇంకా ఏవేవో కావాలనే అసంతృప్తితో ఉన్న వాళ్ళూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అలా అసంతృప్తి గా ఉండటం కేవలం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్న విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్లనే. మనం కోరుకునే ప్రతి ఐహిక సుఖము దుఃఖం అనే కిరీటాన్ని ధరించిగాని మన దగ్గరకి ఎన్నడూ రానే రాదు. జీవితంలో ఏది కోరుకోవాలో ఏది కోరుకో కూడదో ఏది మనకి తగినదో ఏది మనకి తగదో అన్న విచక్షణ జ్ఞానం లేక పోవడం వల్లే మనం తరచు కష్టాలకి గురయ్యేది.*

*పరమాత్మ  మనిషికి పుట్టుక తోనే మూడు రకాల శక్తులు ఇచ్చాడు. అవి ఒకటి ఇచ్చాశక్తి,రెండుజ్ఞానశక్తి, మూడు క్రియాశక్తి.*

*ఒకటవది ఇచ్చా శక్తి :-*

*అంటే ఏదైనా కోరుకునే శక్తి లేదా దేనికైనా సంకల్పించే శక్తి.  ఈ ప్రపంచం లో కోరికలు లేకుండా ఎవరూ ఉండరు.  ఆఖరికి దేవుళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. మహా ఋషులకి సైతం కోరికలు ఉంటాయి.  అయితే వాళ్ళ కోరికలు అన్నీ నిస్వార్ధం గా ఉండి, భగవత్ కార్యాలపై దృష్టి కలిగి, సర్వ మానవాళికి శ్రేయస్సు కలిగించేవి అయి ఉంటాయి.  అలాంటిది మామూలు మనుషులు గా పుట్టిన మనకి ప్రాపంచిక మైన కోరికలు ఉండటంలో ఏ మాత్రం తప్పు లేదు.  కోరికలు లేనిదే, మనసులో “ఇచ్చ” అనేది లేనిదే మనం ఏ కర్మ చేయలేము.  అయితే మనం ఇక్కడే పొరపాటు చేస్తుంటాము. మనం ఏది కోరుకున్నా భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు కాని మనం కోరికునే కోరికలు అన్నీ భగవంతుడి నియమానికీ, ఈ ప్రకృతి నియమాలకి వ్యతిరేక మైనవిగా ఉండకూడదు.  ఇక్కడ మన విచక్షణ గనకా బలహీనం అయితే మనం శాశ్వత మైన ఆనందాన్ని ఇచ్చేవి కాకుండా అనిత్య మైనవి, అశాశ్వతమైన వాటినే మనం ఎక్కువగా కోరుకుంటాము.  మనకున్న జ్ఞానశక్తి గనకా బలహీనంగా ఉంటే మనకు నిజంగా ఏది అవసరమో ఏది అనవసరమో సరిగ్గా గ్రహించలేము. అనవసరమైనవి అన్నీ కోరుకుని వాటిని పొందే ప్రయత్నంలో వాటిని నిలుపుకొనే ప్రయత్నం లో అనేక కష్టనష్టాలు కొనితెచ్చు కుంటాము. మనం కోరుకున్న వాటివల్ల మనం అనేకమైన బాధలు పడుతూ ఇతరుల అసూయా ద్వేషాలకి గురి అవుతూ ఎన్నో కష్టాలకి అవమానాలకి గురి అవుతూ చివరికి మనం కోరుకున్న వాటివల్ల ఏ సుఖము లేదని గుర్తించే స్థితికి వెళ్తాము.*

*రెండవది జ్ఞానశక్తి :-*

*ప్రతి మనిషికి సహజంగా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అది ఎంత ఉందన్నది, ఏ విషయానికి సంబంధించింది ఉందన్నది వేరే విషయం. మనకి మనసు అంటూ ఒకటి ఉంది గనకా మన దగ్గర కొద్దో గొప్పో మన పూర్వజన్మ సంస్కార పరంగా వచ్చిన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఉంది గనకనే మనం కోరుకుంటాము. అదే ఇచ్చాశక్తి అనబడుతుంది.  మనకి జ్ఞానశక్తి కూడా ఉంది గనకనే మనకి ఇచ్చాశక్తి కూడా ఉంది. ఎంతో కొంత జ్ఞానం లేకుండా మనకి తెలియని విషయాలని మనం కోరుకోలేము. మనకు తెలిసున్నవిషయాలని, వస్తువులని కోరుకోగలము గాని ఎప్పుడో కొన్ని సంవత్సరాల తరవాత రాబోయే వాటిని మనం ఇంకా చూడని విషయాలని వస్తువులని మనం ఇప్పుడే కోరుకోలేము. మనం ఏది కోరుకున్నా దేన్నీ ఆశించినా మనకి తెలిసున్న దాన్ని మనకి అనుభవంలో ఉన్నదాన్నే కోరుకుంటాము గాని మనకి తెలియని దాన్ని మన అనుభవంలో లేని దాన్ని కోరుకోలేము. ఈ విధంగా కోరుకోడానికి ఆధారమైనదే జ్ఞానశక్తి.*

*మూడోది క్రియాశక్తి :-*

*మనం దేన్నీ అయితే కోరుకుంటామో దాన్ని పొందటానికి చేసే ప్రయత్నం మనం పడే శ్రమ దీన్నే క్రియాశక్తి లేదా కర్మ అంటారు. ఇది అందరికీ ఉంటుంది. కేవలం మనుషులకే కాదు అన్ని జీవరాసులకి ఉంటుంది. చిన్న దోమ కూడా దాని జ్ఞానశక్తి తో కలిగిన కోరికని తీర్చుకునేందుకు దాని క్రియాశక్తి ని ఉపయోగిస్తుంది. దోమకి తెలుసు ఎవరిని కుట్టాలో .. దేన్నీ కుట్టాలో. మనం ఒక కుర్చీలో కూర్చుంటే దోమ వచ్చి మనల్ని కుడుతుంది కాని కుర్చీని కుట్టదు. ఎందుకు ? దానికి తెలుసు చెక్క లోనుంచి దానికి కావలసిన రక్తం రాదనీ. అదే దానికి ఉన్న జ్ఞాన శక్తి. కుట్టాలి అన్నది దాని కున్నఇచ్చా శక్తి. సరిగ్గా అదను చూసి మనల్ని కుట్టడం అన్నది దాని క్రియా శక్తి. దాని క్రియా శక్తి లో అది పక్కా గా ఉంటుంది. మనం దోమ తెర వేసేలోపే అది లోపలకి దూరి పోగలదు. కాబట్టి మనిషి తో పాటు జీవులకి కూడా ఎంతో కొంత జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి భగవంతుడు ఇచ్చాడు.  అయితే సమస్య ఏంటంటే జంతువులతో పాటు మనకి కూడా ఈ జ్ఞానశక్తి అనేది పరి పూర్ణంగా ఉండదు. మనకి జ్ఞానశక్తే గనక పూర్తిగా ఉంటే మనకి ఏ సమస్యలు రావు వచ్చే అవకాశమే ఉండదు. మనకి జ్ఞానశక్తి అనేది పరిమితం గానే ఉంది పూర్తిగా లేదు. మనకి ఆ జ్ఞానశక్తి వంద శాతం పూర్తిగా పనిచేయదు. మనం ఎన్నో విషయాలని ఇది ఇలా జరుగుతుంది లేదా ఇలా మారుతుంది అని ఎన్నో రకరకాలుగా ఊహిస్తాము, కాని అవి మన ఊహల్ని తల్లకిందులు చేస్తూ వేరే రకంగా జరుగుతూ ఉంటాయి. నిజంగా మన జ్ఞానశక్తి పరిపూర్ణంగ గనక పనిచేస్తే మనం ఒక పని లేదా ఒక కోరిక కోరుకోవడం వల్ల దాన్ని తీర్చుకునే ప్రయత్నం లో మనకి జరగబోయే నష్టం గనకా ముందుగా తెలిస్తే మనం ఆ పని పొరపాటున కూడా చేయము. తెలిసి నష్టం తెచ్చుకోము. మనం చేయబోయే పని వల్ల వచ్చే ఉపద్రవం మనకి పక్కాగా ముందే తెలిస్తే గనకా మనం ఆ పని చేసే అవకాశమే లేదు. సమస్యలో ఇరుక్కునే ప్రసక్తే ఉండదు.*

*ఉదాహరణకి మనం ప్రయాణం కి వెళ్ళ వలసి వచ్చినప్పుడు ఆ ప్రయాణం లో మనకి ఫలానా చోట ఫలానా ప్రదేశం లో మనం ప్రయాణం చేసే వాహనానికి ప్రమాదం జరిగి అందరితో పాటు మనం కూడా తీవ్రంగా గాయ పడతాము అని గనక మనకి ముందే తెలిస్తే మనం ఆ ప్రయాణం మానుకుంటాము.*

*ఇతరుల సలహాలు విని అవి నిజంగా వాళ్ళు చెప్పినట్టే లాభాల్ని కలిగిస్తాయని నమ్మి మనం ఎన్నో పనులు చేస్తుంటాము, కాని చివరికి అవి వాళ్ళు చెప్పినట్టుగా జరగవు. ఈ సంబంధం మంచిది అని చెప్తారు చేస్తాం కానీ వివాహం అయిన కొన్నాళ్ళకే కలహాలతో విడిపోతారు. ఫలానా సంస్థ లో దాంట్లో డబ్బులు దాస్తే వడ్డీ ఎక్కువ వస్తుందని దాస్తాము, కాని ఒక రోజు హఠాత్తుగా ఆ సంస్థ మాయమై పోతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలలో మన జ్ఞానశక్తి పనిచేయదు. అలా జరుగుతుందని ముందే తెలిస్తే మనం అసలు నష్టం కలిగించే పనులు చేయనే చేయం. లాభం జరుగుతుందని చెడ్డపని చేసినా దానికి మంచి ఫలితం రాక పోవచ్చు. పోనీ మంచి జరుగుతుందని మంచి పని చేసినా దానికి నష్టం జరగోచ్చు.*

*మనం స్వార్ధం ప్రయోజనం కోసం చేసే ఒక పనిలో మనం విజయ పధం లో నడుస్తూ ఉంటే .. అది అంతా నావల్లె నడుస్తోంది అనుకుంటాము. కాని నడిచేది కేవలం మన అహంకారం మాత్రమే. మనం అనుకున్నది జరగక పోవచ్చు. కాని జరిగే వాటిని ఎవ్వరూ ఆపలేరు. మనం ఆశించింది మనకి రాకపోవచ్చు కాని మనకి రాబోయే ఒక లాభాన్ని గానీ నష్టాన్ని గానీ సుఖాన్ని గానీ దుఃఖాన్ని గానీ మనకి దక్కకుండా ఆఖరికి ఆ భగవంతుడు కూడా అడ్డు పెట్టి ఆపలేడు అన్నది ఈ సృష్టి లో ఉన్న పరమాద్భుత మైన సత్యం.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో 

Related Posts