యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో ధాన్యం దండిగా వచ్చి చేరుతున్నది. దీంతో కేంద్రాలన్ని ధాన్యం రాశులతో నిండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 159 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సీజన్‌లో జిల్లాలో లక్షా10 వేల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్న లక్ష్యంగా పెట్టుకొని అందుకు తగ్గట్లు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేసింది. గజ్వేల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించగా, మిగితా చోట్ల స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. వరిధాన్యం గ్రేడ్ (ఏ) రకం క్వింటాల్‌కు రూ.1,590, సాధారణ రకానికి రూ.1,550 మద్దతు ధరను ప్రభు త్వం నిర్ణయించింది. జిల్లాలో 159 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతానికి 40లక్షల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉన్నాయి. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభానికి ముందే గన్నీ బ్యా గులు, తాగునీటి సౌకర్యం, మహిళల కోసం తాత్కాలిక టాయిలెట్స్, కరెంట్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్, మాశ్చరైజ్ మీటర్లు అందుబాటులో ఉంచారు. రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగానే తొలుత టోకెన్లు అందజేస్తున్నారు. రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని 34 రైస్ మిల్లులకు తరలించి కస్టమ్స్ మిల్లింగ్ చేపట్టనున్నారు. అయితే ముందుగా ట్యాగు చేసిన మిల్లుకు ధాన్యం పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యాన్ని తరలించడానికి జిల్లాలో మూడు జోన్లుగా విభజించారు. ఎక్కడికక్కడ అనుకూలంగా ఉండే విధంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌లను రవాణా కాంట్రాక్టర్లను నియమించారు.రైతు ధాన్యం మిల్లులో అన్‌లోడ్ అయి, ట్యాబ్‌లో అప్‌లోడ్ అయిన 48 గంటల్లో రైతుల ఖాతలో డబ్బులు జమ కానున్నాయి. ఇందుకు రైతులు ధాన్యం తీసుకువెళ్లే సమయంలోనే రైతు ఆధార్‌కార్డు, పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాత నెంబరును తీసుకెళ్లాలి. వీటిని నిర్వాహకులు నమోదు చేసుకుంటారు.