జీఎస్టీ లోకి పెట్రోల్, డీజిల్ చేర్చాలంటే కౌన్సిల్ సిఫారసు అవసరం
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి
న్యూఢిల్లీ జూలై 19
పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ ఇంతవరకు రాలేదని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలు, వంట నూనెల ధరలపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగిందా, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రాతినిధ్యాలు వచ్చాయా? వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనిపై రాష్ట్రాలతో ఏదైనా చర్చ జరిగిందా అనే ప్రశ్నలను సభలో సభ్యులు లేవ నెత్తారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా, జీఎస్టీ పెట్రోల్, డీజిల్ చేర్చాలంటే కౌన్సిల్ సిఫారసు అవసరమని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. ఇది జీఎస్‌టీ కౌన్సిల్ పరిధిలోని దనీ, ఆదాయం సహా, సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతనెల (జూన్,12) జరిగిన 44వ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ చర్చకు రాలేదన్నారు.ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్లు స్వయంగా మంత్రి లోకసభలో వెల్లడించారు. ఈ కాలంలో ఒక ఒకసారి పెట్రోల్ ధరను, రెండుస్లారు డీజిల్ ధరను తగ్గించగా, మిగిలిన రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. గత ఏడాది 2020-21లో, పెట్రోల్ ధరను 76 సార్లు పెంచగా,10సార్లు తగ్గించారు, డీజిల్ రేట్లు 73 సార్లు పెరగ్గా, 24 సందర్భాలలో తగ్గించామని తెలిపారు.కాగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలకు కళ్ళెం వేసేందుకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు రావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. మరోవైపు పెట్రోల్,డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తే, కేంద్ర ప్రభుత్వం దానిని పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.