అలనాటి తార కృష్ణకుమారి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులో బుధవారం తుదిశ్వాస విడిచారు. 1993 మార్చి 6న బెంగాల్‌లో పుట్టిన కృష్ణకుమారి, నటి షావుకారు జానకికి చెల్లెలు. 'నవ్వితే నవరత్రాలు' అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన కృష్ణ కుమారి.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మంచి నటిగా రాణించారు. తెలుగులో 'భార్యాభర్తలు', 'వాగ్ధానం', 'స్త్రీ జన్మ', 'కులగోత్రాలు', 'గుడిగంటలు', 'పిచ్చి పుల్లయ్య', 'పల్లె పడుచు', 'బంగారు పాప', 'బందిపోటు', 'ఎదురీత', 'చిక్కడు దొరకడు', 'వరకట్నం', 'లక్షాధికారి' సహా 110కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్, జగ్గయ్య, కాంతారావు, కృష్ణ వంటి దిగ్గజాల సరసన నటించారు.