విశాఖపట్టణం, జూలై 21,
విశాఖ జిల్లాలో ఆరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలతోపాటు సుమారు అరవై వరకు ప్రైవేటు ఐటీఐలున్నాయి.అయితే వీటితో ఉపాధి అవకాశాలు ఉన్నా... విద్యార్థులు మాత్రం వీటి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధారణ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారిలో చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించని పరిస్థితులున్నాయి. పదో తరగతి పూర్తయ్యాక ప్రభుత్వరంగ, ప్రైవేటు కంపెనీల్లో ఉపాధినిచ్చే వాటిలో ఐటీఐ కోర్సులు ప్రధానమైనవి కావడంతో ప్రస్తుతం యువతరం వీటిపై దృష్టి సారిస్తున్నారు. ఐటీఐల్లో ఏడాది, రెండేళ్ల వ్యవధితో ట్రేడులున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ఏడాది నుంచి రెండేళ్ల పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. పదో తరగతి పూర్తయిన తర్వాత మూడేళ్లు కష్టపడితే ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. పిన్న వయసులోనే ఉద్యోగం సాధించేందుకు ఐటీఐ కోర్సులు బాటలు వేస్తాయి. ఆర్‌ఆర్‌బీ, బీహెచ్‌ఈఎల్, షిప్‌యార్డు, నేవల్ డాక్‌యార్డు, ఏపీజెన్‌కో, ఏపీఈపీడీసీఎల్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ, ల్యాండ్ సర్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలతోపాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చు.విశాఖ కంచరపాలెంలోని ప్రభుత్వ పాత ఐటీఐ, గాజువాకలో న్యూఐటీఐ, బాలికల ఐటీఐ అరకులోయ, చింతపల్లిలో ఆర్‌ఐటీఐ, నర్సీపట్నంలో ప్రభుత్వ ఐటీఐలున్నాయి. చింతపల్లి మండలం పెంటపాడు ఆర్‌ఐటీఐలో ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఫిట్టర్, మోటారు మెకానిక్ ట్రేడులు అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది యూనిట్లకు మొత్తం 215 సీట్లు ఉన్నాయి. చింతపల్లికి అనుబంధంగా కొనసాగుతున్న సీలేరు ఐటీఐలో కార్పెంటరీ, ప్లంబర్, స్టెనోగ్రఫీ ట్రేడుల్లో 78 సీట్లు ఉన్నాయి.పెంటపాడు ఆర్‌ఐటీఐ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది ఈ-లెర్నింగ్ పేరిట డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ప్రపంచ బ్యాంకు నిధులు ఒకేషనల్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాం (వీటీఐపీ) ద్వారా రూ.80 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటికే ఉన్న అన్ని ట్రేడులకూ అవసరమైన అత్యాధునిక సాంకేతిక యంత్ర సామగ్రిని కొనుగోలు చేశారు. రూ.కోటిన్నర వ్యయంతో మరో రెండు షెడ్లు, నాలుగు తరగతి గదులు, అంతర్గత రహదారులు, రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక శిక్షణ సంస్థకు ప్రత్యేకంగా పరిపాలనా భవనం నిర్మాణానికి కేంద్రం రూ.41.5 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన కార్యాలయ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ఆర్‌ఐటీఐలోనే ఉంటూ చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం పోస్టుమెట్రిక్ వసతిగృహాన్ని మంజూరుచేసింది. కోఫా, డీజిల్ మెకానిక్ ట్రేడులు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఇవి అందుబాటులోకి వస్తే మరో 47 సీట్లు పెరిగే అవకాశం ఉంది. పెంటపాడు ఆర్‌ఐటీఐలోనే మోటారు మెకానిక్, వెల్డింగ్‌లో శిక్షణ పొందుతున్న 63 మంది విద్యార్థులను ఇటీవలే విశాఖ పంపారు. అక్కడ సిమెన్స్ కంపెనీ ఇండో జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (ఐజీఐఏపీ) ఫోర్‌వీలర్, టూవీలర్ మరమ్మతులతోపాటు టిగ్, మిగ్ వెల్డింగ్‌పై నెల రోజులపాటు శిక్షణ ఇచ్చింది