YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

26 తీర్పుపై ఉత్కంఠ

26 తీర్పుపై ఉత్కంఠ

విజయవాడ, జూలై 21,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దవుతుందన్న వదంతులు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ వ్యతిరేక మీడియా ఈ ప్రచారాన్ని ఎక్కువగా చేస్తుంది. ఈ నెల 26వ తేదీన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ విచారణ జరపనుంది. ఆరోజే తీర్పు వెలువడే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ బెయిల్ రద్దుపై ఇటు వైసీపీలోనూ, అటు టీడీపీలోనూ ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారని రాజుగారి తరుపున న్యాయవాదులు వాదించారు. తాను ఈ పిటీషన్ వేసినందుకే తనపై దేశ ద్రోహం కేసు కూడా పెట్టారంటూ ఆయన తరుపున న్యాయవాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. దీనిపై జగన్ తరుపున న్యాయవాదులు తమ వాదనను లిఖితపూర్వకంగా అందచేశారు. సీబీఐ తరుపున వాదనలను మాత్రం ఇంకా న్యాయస్థానానికి చేరలేదు. ఈ నెల 26వ తేదీలోపు లిఖితపూర్వకంగా వాదనలను తెలియజేయాలని సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. రఘురామ కృష్ణరాజు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల 26వ తేదీన ఈ కేసు తేలిపోతుందని, తనకు న్యాయం జరుగుతుందని గట్టిగా అంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో జగన్ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని జగన్ పార్టీ బహిరంగంగానే ఆరోపిస్తుంది. బెయిల్ రద్దు అంశం సమీపిస్తున్న సమయంలో జగన్ దూకుడు పెంచింది కట్టడి చేయడం కోసమేనన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. వైసీపీ అవసరం రాజ్యసభలో బీజేపీకి ఉంది. ఈ సమయంలో గట్టిగా నొక్కితే తప్ప తమకు ప్రయోజనం ఉండదని జగన్ ఈ స్టాండ్ తీసుకున్నారని కూడా అంటున్నారు. జగన్ బెయిల్ రద్దవుతుందని ప్రచారం బాగా జరుగుతున్న సమయంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఎటు వైపునకు తిరుగుతాయన్నది వేచి చూడాల్సి ఉంది.

Related Posts