హైదరాబాద్, జూలై 21,
తెలంగాణ రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. వారం రోజులుగా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములు, ఆస్తుల మార్కెట్ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల విలువను పెంచాలని సర్కారు ఆలోచిస్తుండటంతో ఆ ఉత్తర్వులు రాకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు ఆఫీసులకు జనం క్యూ కడుతున్నారు. అగ్రిమెంట్లు రాయించుకొని వాయిదాలు పెట్టుకున్నవాళ్లు కూడా ముందే రిజిస్టర్ చేయించుకోవడానికి వస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ రోజువారీ ఆదాయం రూ. 50 కోట్లు దాటుతోంది. సోమవారం ఒక్కరోజే 6,918 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలలో రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్, ఈసీల జారీ, ఫ్రాంకింగ్ మెషీన్, సర్టిఫైడ్ కాపీల జారీ ద్వారా రూ. 638.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం గత మూడు నెలలతో పోలిస్తే జులైలోనే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెలలో ఇప్పటివరకు 74,943 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సాధారణంగా రోజూ 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా సోమవారం 95 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ భూముల విలువ పెంపు ప్రతిపాదన కూడా సర్కారు దగ్గర ఉండటంతో ధరణి పోర్టల్‌లోనూ రోజూ 4 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. గత 19 రోజుల్లో 14 రోజులు వర్కింగ్ డేస్ కాగా మొత్తం 65,026 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. 6,541 పెండింగ్ మ్యుటేషన్లు.. 1,761 నాలా అప్లికేషన్లను క్లియర్ చేశారు