హైదరాబాద్, జూలై 21,
దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందికి పైగా ఫ్రెషర్స్ను నియమించుకోవాలని చూస్తున్నాయి. ఐటీ సర్వీస్‌లకు డిమాండ్ పెరుగుతుండడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు హైరింగ్ యాక్టివిటీని పెంచాయి. ఈ నాలుగు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 లక్షల నియామకాలు చేపట్టనున్నాయి. మొత్తంగా ఐటీ రంగంలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వడంలేదు. అయితే ప్రస్తుతం కంపెనీలలో ఉద్యోగుల అవసరాలు పెరుగుతుండటంతో.. భారీగా నియామకాలు చేపట్టాలని చూస్తున్నాయి. అంతేకాకుండా సీనియర్లను ఉద్యోగాలలోకి తీసుకుంటే.. వారికి జీతాలు ఎక్కువగా చెల్లించాలి. ఐటీ ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగం మారితే కనీసం 70 శాతం శాలరీ ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రెషర్స్‌ను తీసుకోవడమే బెటర్ అని కంపెనీలు భావిస్తున్నాయి.కరోనా మహమ్మారి తర్వాత ఐటీ కంపెనీలు భారీ ప్రాజెక్టులను దక్కించుకున్నాయి. టీసీఎస్‌కు ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ డీల్ లభించగా, ఇన్ఫోసిస్‌కు డైమ్లెర్ కాంట్రాక్టు లభించింది. అదేవిధంగా విప్రో కూడా మెట్రో ఏజీ నుంచి డీల్ కుదుర్చుకుంది. దీంతో కంపెనీలు ఫ్రెషర్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు టాప్ ఫోర్ కంపెనీలు 48,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. టీసీఎస్ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 20 వేల మందిని తీసుకుంది. విప్రో 12 వేల మందిని, ఇన్ఫోసిస్ 8,300 మందిని, హెచ్‌సీఎల్ 7,500 మందిని హైర్ చేసుకున్నాయి. టీసీఎస్ గతేడాది కూడా 40 వేల మంది ఫ్రెషర్స్కు జాబ్స్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్ను నియమించుకుంటామని టీసీఎస్ పేర్కొంది. ఇన్ఫోసిస్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్‌గా 35 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 10 వేల మంది సీనియర్లను, 2 వేల మంది ఫ్రెషర్స్ను నియమించుకున్నామని విప్రో ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో మరో 6 వేల మందిని హైర్ చేసుకోవడానికి కంపెనీ ప్లాన్స్ చేస్తోంది. 2022–23 నాటికి మొత్తం 30 వేల మందికి ఆఫర్ లెటర్స్ అందించాలని కంపెనీ భావిస్తోంది. ఏదేమైనా కంపెనీల నిర్ణయంతో ఫ్రెషర్స్‌లలో ఉద్యోగాల పట్ల మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయనే చెప్పుకోవాలి.