YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా విద్యాబోధన ఉండాలి          ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు

సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా విద్యాబోధన ఉండాలి          ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు

సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా విద్యాబోధన ఉండాలి
         ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు
న్యూఢిల్లీ జూలై 21
విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా.. వారిలో సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విద్యను అందించడమే కాకుండా వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని సూచించారు. ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (పానిపట్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి తన నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్‌లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వామోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్ననాటి నుంచే విమర్శనాత్మకమైన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా తాము ఎంచుకున్న రంగాల్లో విద్యార్థులు అద్భుతాలు సృష్టించేందుకు అవకాశం ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో మరింత క్రమశిక్షణను పెంపొందించుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. గ్రామీణ, పట్టణ అంతరాలను తగ్గించుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో విద్యాబోధన అందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. విద్యారంగంలో సాంకేతికత, కృత్రిమమేధ వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యాబోధన, విద్యాభ్యాస విధానాలను మరింత సరళీకృతంగా, ప్రభావవంతంగా మార్చుకోవాలని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అటవీ సంపద విధ్వంసం, కాలుష్యం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. ఈ సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి ఒక్కటే సరైన మార్గమని, ఆ దిశగా విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ‘వేదాలు, ఉపనిషత్తుల ఘనమైన వారసత్వాన్ని.. వాటిలోని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా, విజ్ఞానకేంద్రంగా నిలబెట్టాల్సిన సరైన తరుణమిదే’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్, ఓపీ జిందాల్ వర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ నవీన్ జిందాల్, విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్‌కుమార్ సహా 25 దేశాలకు చెందిన 150 మందికిపైగా మేధావులు, ఉపకులపతులు ఇంటర్నెట్‌ వేదిక ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు.

Related Posts