మిస్టర్ మోడీ... మీకు బెంగల్ ప్రజల మద్దతు లేదు
కోల్ కత్తా, జూలై 21,
దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ కుంభకోణంపై పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రజాస్వామ్యా మనుగడకు ముప్పు ఏర్పడిందని, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రజలనుద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడటం ఇదే తొలిసారి.
తాను జులై 27 లేదా 28న ఢిల్లీకి వెళ్లి అందుబాటులో ఉన్న ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తానని చెప్పారు. ‘మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఈ మూడు అంశాలే ప్రజాస్వామ్యానికి మూలం.. ఈ మూడింటిని పెగాసస్ హ్యాక్ చేసింది’ అని మండిపడ్డారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫోన్ సైతం హ్యాక్ చేసినట్టు ది వైర్ కథనం వెల్లడించింది.ఇజ్రాయెల్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ ప్రమాదకరమైంది.. భయంకరమైంది అని వ్యాఖ్యానించిన దీదీ.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఒకరితో ఒకరు మాట్లాడలేరని అన్నారు. ‘నేను ప్రజలతోనూ, పవార్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు మాట్లాడే పరిస్థితి లేదు.. నా ఫోన్ కెమెరాను ప్లాస్టర్‌తో మూసేశాను’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు.మిస్టర్ మోదీ.. నా నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించడంలేదు.. కానీ, బహుశా మీరు, మీ హోం మంత్రి (అమిత్ షా) కలిసి ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉసిగొల్పుతున్నారు.. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారు... అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.. బెంగాల్‌లో మీకు ప్రజల మద్దతు లేదు’ అని ఘాటుగానే మోదీపై విరుచుకుపడ్డారు.ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉండే పెగాసస్ స్పైవేర్.. నిఘా కార్యకలాపాల కోసం ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్ విక్రయిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజా హ్యాకింగ్ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీంతో తమకెలాంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది.
ప్రజాస్వామ్య దేశం నుంచి నిఘా దేశంగా భారత్ఁ
స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్‌కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు. వీడియోను, ఆడియోను కూడా ట్యాప్ చేస్తున్నారని, అందుకే తాను ఫోన్‌కు ప్లాస్టర్ వేసుకున్నట్లు చెబుతూ తన ఫోన్‌ను చూపించారు. ఫోన్ల హ్యాకింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. పెగాసస్ చాలా ప్రమాదకరం. వాళ్లు వ్యక్తులను హింసిస్తున్నారు. కొన్నిసార్లు నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఢిల్లీ లేదా ఒడిశా చీఫ్ మినిస్టర్‌లతో మాట్లాడలేకపోతున్నానని ఆమె అన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. దేశాన్ని ఓ నిఘా కేంద్రంగా చేయాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. దీనికి బీజేపీయే కారణం. వాళ్లు తమ మంత్రులనే విశ్వసించడం లేదు. వాళ్లు అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు అని మమత విమర్శించారు. దేశంలో స్పైగిరి నడుస్తోంది. జడ్జీలు, మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. వాళ్లు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్మూలించారు. పెగాసస్ మొత్తం ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మంత్రులు, మీడియాల సమాచారాన్ని రాబట్టింది. దీన్ని ప్రజాస్వామ్యం దేశం నుంచి నిఘా దేశంగా మార్చాలని అనుకుంటున్నారు అని మమత అన్నారు.